బాబు కుప్పం గ్యారంటీ.. బాలయ్య హిందూపురం గ్యారంటీ.. లోకేష్‌ మంగళగిరి మాత్రం నో గ్యారంటీ?

ఎన్నికల నామిషన‌్ల పర్యం మొదలైంది. నేతలకు పోలింగ్‌ డెడ్‌లైన్‌ మరింతగా దగ్గరకు వచ్చింది. అయితే టీడీపీ నేతల కీలక స్థానాలకు ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు మరోసారి కుప్పం నుంచే పోటీ చేస్తున్నారు. నిన్న భువనేశ్వరి ఆయన తరపున నామినేషన్‌ కూడా వేశారు. కుప్పం విషయానికి వస్తే.. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి దెబ్బ పడినా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం చంద్రబాబు దీమాగానే ఉన్నారు. ఇటీవల ఆయన ఒకటి, రెండు సార్లు అక్కడ పర్యటించారు. పార్టీ అధినేతగా చంద్రబాబు రాష్ట్రమంతా తిరగక తప్పని పరిస్థితుల్లో స్థానిక నేతలే అక్కడ చక్కబెడుతున్నారు.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన బాలయ్య మరోసారి గెలుస్తాం.. హ్యాట్రిక్ పక్కా అన్న ధీమాలో ఉన్నారు. ఆయన కూడా నిన్న మొన్నటి వరకూ హిందూపురం ముఖమే చూడలేదు. ఇటీవలే ఆయన సీమలో ప్రచారం ప్రారంభించారు. అయినా సరే.. హిందూపురంలో బాలయ్య గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు కూడా లేవు. ఇప్పటికే రంగంలోకి దూకిన బాలయ్య ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది.

మరో టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ విషయానికి వస్తే.. ఆయన మరోసారి మంగళగిరి బరిలో దిగుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగిన లోకేశ్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. భవిష్యుత్‌లో టీడీపీని నడిపించాల్సిన నాయకుడు కావడంతో ఈసారి ఆయనకు గెలుపు అత్యవసరం. వరుసగా రెండోసారి ఓడితే అది ఆయన రాజకీయ భవిష్యత్‌కే పెద్ద దెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేశ్‌ కొన్నాళ్లుగా మంగళగిరికే పరిమితం అవుతున్నాడు. మంగళగిరి దాటి ప్రచారం చేయట్లేదు. బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న స్థానం కావడంతో వైసీపీ వ్యూహాత్మకంగా చేనేత మహిళ మురుగుడు లావణ్యను ఇక్కడ బరిలో దింపింది. అందుకే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో లోకేశ్ మంగళగిరిని వదలట్లేదు. అయితే.. ఇంత చేస్తున్నా మళ్లీ పక్కాగా గెలుస్తాడన్న దీమా మాత్రం కనిపించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: