మోడీ మళ్లీ గెలిస్తే.. రేవంత్ సర్కారు కూలడం ఖాయం?

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తే రేవంత్ సర్కారు కూలిపోతుందా?  ప్రజా తీర్పును అపహాస్యం చేసి ప్రభుత్వాలను పడగొట్టి అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించడం.. ఆ పార్టీకి మెజార్టీ సీట్లను అందిస్తాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
రేవంత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. అధికారం మాదంటే మాదే అని పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ అక్కడి ప్రభుత్వాలను కూల్చి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.  ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను టార్గెట్ చేయడం అనైతికమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. మరి ఇది తెలంగాణ లో సాధ్యం అవుతుందా లేదా అనేది ఓ సారి పరిశీలిస్తే..
ప్రస్తుతం కాంగ్రెస్ 64 ఎమ్మెల్యేలు, మిత్రపక్షం సీపీఐ 1తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది బొటాబొటీ మెజార్టీ అయినా.. ప్రభుత్వాన్ని నడపవచ్చు. కానీ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. వాళ్లు దీనిని అనైతికం అని విమర్శిద్దామన్నా మీరే ప్రభుత్వాన్ని కూల్చుతాం అంటున్నారు అందుకే బలపరుచుకునేందుకు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాం అని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తారు.  ప్రజలు కూడా నిజమే అనుకుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు ఓ రకంగా చెప్పాలంటే హస్తం పార్టీకి బూస్ట్ లాంటివే.
తాజా లెక్కలు చూసుకుంటే పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలుపుకొని కాంగ్రెస్ కు 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  మరో పాతిక మంది వస్తారు అని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అండగా ఎంఐఎం ఉంది. ఇలా లెక్కన చూసుకుంటే ఆపార్టీ బలం 90కి పైగా చేరుతుంది.  ఏ విధంగా చూసినా ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. మొత్తం మీద ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీకే నష్టం కలిగిస్తాయి.. తప్ప ఉపయోగం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: