చంద్రబాబు-పవన్‌: జగన్‌ కాళ్లకు బంధం వేసేశారుగా?

సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అత్యంత ఆసక్తికరమైన అంశంగా ఉన్న సంగతి తెలిసిందే. పైకి ఎన్ని చెబుతున్నా.. విపక్షాలకు వాలంటీర్ల విషయంలో లోలోన ఒక రకమైన ఆందోళన ఉందనే చెబుతుంటారు. ఇటీవల టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు, దీనికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు ఈ కోవలోకే వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంగతి అలా ఉంటే.. తాజాగా వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు విధించింది.

అవును.. ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రం ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఎటువంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల చేత డబ్బులు పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఈ విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ కోడ్ ప్రభావం వాలంటీర్లపై పడింది. అయితే సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకే అందించేందుకు ఈ వ్యవస్థను రూపొందించిన విషయం తెలిసిందే.

ఈ సేవలు ఓటర్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని.. టీడీపీ,జనసేన నాయకులతో పాటు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లు ఎన్నికల కమిషన్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ లపై స్పందించిన ఎన్నికల కమిషన్.. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సీఈసీ తాజాగా వాలంటీర్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపినీ చేయించొద్దని.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వారి వద్ద ఉన్న ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏప్రిల్, మే జూన్ నెలల్లో ఇచ్చే పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వాలంటీర్లు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హాయిగా ఇంటి దగ్గరే పింఛన్ తీసుకుంటున్నారని ఇప్పుడు వీరంతా తిరిగి లైన్లలో నిలబడి ఫించన్లు తీసుకోవాలని దీనికి బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.  మరి దీని ప్రభావం ఎన్నికల్లో ఏ పార్టీపై పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: