నరసాపురం ఆక్రోశం: ఆ బీజేపీ టికెట్ జగన్ డిసైడ్ చేశాడా?

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఈ ప్రక్రియ పూర్తి చేసేసింది. టీడీపీ కూడా దాదాపు అన్ని స్థానాలను ప్రకటించేసింది. తాజాగా బీజేపీ, జనసేన కూడా ఆ పని దాదాపుగా పూర్తి చేశాయి. అయితే.. కూటమి పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే ఈ స్థానంపై రఘురామ కృష్ణంరాజు చాలా ఆశలు పెట్టుకున్నారు. అది ఆయన సిట్టింగ్ సీటు. గత ఎంపీ ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి వైసీపీ టిక్కెట్ పై గెలిచారు.

అయితే.. గెలిచిన కొద్ది నెలలకే ఆయన వైసీపీకి యాంటీ అయ్యారు. అప్పటి నుంచి వైసీపీ సభ్యత్వం వదులుకోకుండానే వైసీపీకి శత్రువుగా మారారు. నిత్యం జగన్‌ ను ఏకి పారేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆ స్థానానికి ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించేసింది. దీంతో రాజుగారి గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టయింది.

ఈ పరిణామాన్ని అస్సలు ఊహించని రఘురామ కృష్ణంరాజు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అయితే ఇదంతా జగన్ చేసిన కుట్ర అంటున్నారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా తనకు నరసాపురం సీటు రాకుండా జగన్‌ అడ్డుకున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా ఓటమిని అంగీకరిస్తున్నానంటున్న రఘురామ కృష్ణంరాజు.. మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తానో చూస్కో జగన్‌ అంటూ సవాల్ విసురుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే ఉన్నానంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని తేల్చి చెప్పారు. తనకు బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడంపై  ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అయితే తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదని రఘురామ కృష్ణంరాజు అంటున్నారు. నాకు టికెట్‌ రాకుండా తాత్కాలికంగా జగన్‌ విజయం సాధించారంటున్న రఘురామ కృష్ణంరాజు.. జగన్‌కు తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: