బీజేపీ: మోదీ పేరు చెబితే ఏపీలో ఓట్లు పడతాయా?

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తు మాత్రమే ఉంటుంది.. బీజేపీ ఈ కూటమిలోకి రాదు అని భావిస్తున్న క్రమంలో అనూహ్యంగా బీజేపీ సీన్ లోకి వచ్చేసింది. టీడీపీని తిరిగి ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన చేసింది. మూడు పార్టీల ముఖ్య నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం కూటమిపై ప్రకటన వెలువడింది.
అయితే 2014 సీన్ రిపీట్ అవుతుందని.. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. మోదీ చరిష్మాకు తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.  అయితే ఏపీలో బీజేపీ బలంగా లేదనేది అందరికీ తెలిసిన విషయం. గత ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి మోదీ ప్రభావం ఏపీపై ఉంటుందా లేదా తెలియాలంటే కచ్ఛితంగా ఒంటరిగా పోటీ చేయాలి. కానీ ప్రస్తుతం కూటమిగా ఎన్నికలకు వస్తుంది కాబట్టి ఆ ప్రభావం కూటమిపై చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అవి సానుకూల పవనాలా..లేక వ్యతిరేక పవనాలా అంటే ఎన్నికల ఫలితాల వరకు వచే చూడాల్సిందే. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం మోదీ చరిష్మా బీజేపీకి ఓట్లు తెచ్చి పెట్టే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మాట మార్చిందన్న భావన ఈ వ్యతిరేకతకు కారణం కావొచ్చు.
కాకపోతే ఈ విషయాన్ని తీసుకొని అటు వైసీపీ ఎన్నికలకు వెళ్లే సాహసం చేయదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు ఆ ప్రయత్నం చేస్తున్నా వారికి ఓట్లు పడవు. మరోవైపు బీజేపీ క్షేత్రస్థాయిలో లేనప్పుడు మోదీపై సానుకూలత ఉన్నా.. ఉపయోగం ఏమీ ఉండదు.  అందువల్ల ఏపీ ప్రజలకు మోదీపై అభిమానం ఉన్నా అదీ ఓట్ల రూపంలోకి మారదు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: