ఏపీ ప్రత్యేక హోదా.. ఏ పార్టీ చేసిన నేరం?

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు అభివృద్ధి దిశగా ఏపీని ముందుకు నడిపించేందుకు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇదే విషయమై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తీర్చేందుకు ఇదొక ప్రత్యామ్నాయమని  తెలిపారు. అంటే మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా ఈ కూటమి ఏర్పడిందని వీరి వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏపీలో విభజన హామీలు అలానే ఉన్నాయి.  ప్రత్యేక హోదా అంశం తేలనేలేదు. ఇవి నెరవేరలేదు కాబట్టి ఏపీ ప్రజలు ఎవరికి ఓటేయ్యాలి.  ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం లేదు.  ఎందుకంటే విభజన హామీలపై, ప్రత్యేక హోదా అంశంపై అటు అధికార పార్టీ కానీ.. ఇటు ప్రతిపక్షం కనీసం పోరాడలేదు.  ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఓడిద్దామంటే.. ఏపీలో బీజేపీకి ఓటింగే లేదు.

అందువల్ల బీజేపీపై కోపంతో టీడీపీ, జనసేన కూటమికి ఓటేయడం మానేస్తారా అనేది త్వరలో తేలనుంది. వాస్తవానికి ఏపీ విభజన హామీలు అమలు చేయలేదని కేంద్రాన్ని తప్పుపడుతూ ఏ పార్టీ దూషించలేదు. రెండు పార్టీలు కూడా బీజేపీ తో సఖ్యతగానే ఉన్నాయి. వాటితో స్నేహ బంధం కోరుకున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం ఏ పార్టీ చేయలేదు.

తాజాగా వైఎస్ షర్మిళ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూ జనాల్లోకి వెళ్తున్నారు. మరి ఈ ఐదేళ్లు ఏం చేశారు అనే ప్రశ్న ఆటోమేటిక్ గా వస్తుంది. సీపీఐ, సీపీఎంలు పోరాడినా వారికి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని అటు వైసీపీ కానీ.. ఇటు టీడీపీ కానీ తీసుకువచ్చే ప్రయత్నం చేయవు. 2014లో చంద్రబాబు.. 2019లో జగన్  ఇదే నినాదంతో  ఎన్నికలకు వెళ్లారు. ఈసారి వీరిద్దరూ ప్రత్యేక హోదా అంశాన్నే లేవనెత్తరు.  ఇద్దరి ఎజెండా ఒకటే అయినప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: