జనసేనతో పొత్తు బాబు కొంప ముంచుతుందా?

చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిసి ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. సీటు దక్కని నేతలు, వారి అనుచరులు రోడ్డెక్కి చంద్రబాబు తీరును తప్పు పడుతున్నారు. జనసేన పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలు తమను మోసం చేశారంటూ నిప్పులు చెరుగుతున్నారు. పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళనలు, నిరసను నిర్వహించారు.

విజయనగరం టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీనికి నిరసనగా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. నెల్లిమర్ల టికెట్ ను జనసేన అభ్యర్థి లోకం మాధవికి కేటాయించడంపై అక్కడి టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. టికెట్ దక్కుతుందనుకున్న టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగర్రాజు పార్టీ నేతలతో సమావేశం అయి నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

అవనిగడ్డ సీటు తనకు ఇవ్వకపోవడంపై మహదానందంగా ఉందని మాజీ మంత్రి మండలి బుద్దా ప్రసాద్ అన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చిన స్వేచ్చా స్వాతంత్ర్యం పొందినట్లు ఉందని పేర్కొన్నారు. డబ్బు రాజకీయాలకు ప్రధానమై పోయిందని.. పార్టీలు ధనవంతుల కోసం అన్వేషిస్తున్న తరుణంలో తన లాంటి వాళ్లు ఎన్నికల్లో నిలబడాలనుకోవడం సమంజసం కాదన్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ అభ్యర్థిగా సవితను  ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి వర్గం రెచ్చిపోయింది. పెనుకొండలో పార్థసారథి ఇంటి ముందు బైఠాయించి, ఆందోళన చేశారు. కల్యాణ దుర్గం సీటును కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురావు అనుచరులు వీరంగం సృష్టించారు.  మడకశిర టికెట్ ను మాజీ ఎమ్మెల్యే వీరన్న తనయుడు సునీల్ కుమార్ కు కేటాయించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి వర్గం మండిపడింది.  టికెట్ ప్రకటించగానే వీరన్న, సునీల్ కుమార్ లు తిప్పేస్వామి మద్దతు కోరడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ గుమిగూడిన గుండుమల అనుచరులు వారిని ఇంట్లోకి రానవ్వకుండా తలుపులు మూసేసి.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: