ఆ చౌదరికి ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పిన జేసీ?

టీడీపీ తొలి జాబితాలో కొందరికి అనూహ్యంగా చోటు దక్కలేదు. చంద్రబాబు సన్నిహితులుగా పేరున్న వారికి కూడా చోటు దక్కలేదు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాలో హనుమంతరాయ చౌదరి కూడా ఒకరు. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ గద్దెదింపాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు వారి ఆత్మీయులకు కూడా టికెట్ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనా మాజీ ఎమ్మెల్యే హన్మంతరాయచౌదరిని మార్పు చేయక తప్పలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

అభ్యర్థుల ప్రకటన తరువాత నిన్న ఉన్నంత అసంతృప్తి ఇవాళ లేదన్న జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగుదేశంలో అసంతృప్తి పాలపొంగులాంటిదని ఎన్నికల వరకు కొనసాగదని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు గురుగింజ కింద నలుపు చూసి పక్కనపెడ్డారన్న జేసీ దివాకర్ రెడ్డి.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెదేపా అభ్యర్థుల ఎంపిక బాగుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాక్షస పాలన అంతమెందించాలనే లక్ష్యంగా అందరూ నిర్ణయంతో ఉన్నారని.. నా లాంటి వారు కూడా జగన్ అధికారంలోకి రాకూడదనే కోరుకుంటున్నామని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఓటు చీలకుండా ఉండటానికే భాజపాతో పొత్తు కోరుకుంటున్నామన్న జేసీ దివాకర్ రెడ్డి.. అన్ని పార్టీల ధ్యేయం జగన్ అధికారంలోకి రాకుండా ఉండటమేనని తెలిపారు. వైకాపాకు డబ్బు ముఖ్యం....మాకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు నిస్పక్షపాతంగా టికెట్లు కేటాయించారన్న జేసీ దివాకర్ రెడ్డి.. పెనుకొండ, కల్యాణదుర్గం, శింగనమలలో అసంతృప్తులు సర్దుకుంటాయని.. వాళ్ల బాధను కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీలో అసంతృప్తులతో నేను స్వయంగా మాట్లాడుతానని.. అవసరమైతే వారి ఇంటికే వెళ్లి చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరాన్ని చెబుతానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అధిష్టానం ఇప్పటికే కొందరు అసంతృప్తులను పిలిచి మాట్లాడిందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: