టీడీపీపై కర్ర పెత్తనం కోసం బీజేపీ ఆరాటం?

ఏపీలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ వైఖరేంటో అర్థం కావడం లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు పంపించిన కాషాయ పార్టీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. టీడీపీ, జనసేన సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న క్రమంలో పొత్తుకు సిద్ధం అనే సంకేతాలు పంపింది. చంద్రబాబుని దిల్లీ వచ్చి కలవాలని కబురు చేయడంతో ఆయన హస్తిన వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు.

కానీ ఇప్పటి వరకు పొత్తుల పై ఎలాంటి ప్రకటన రాలేదు. అసలు ఉందో లేదో తెలియడం లేదు. అయితే ఈ పొత్తుల్లో ఎవరి వ్యూహం వారికి ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీ లక్ష్యం ఏంటంటే బీజేపీ, జనసేన వల్ల తమకు ఓటు బ్యాంకు పెరగాలి . దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో ఒక బలమైన తోడు కావాలి అని భావిస్తోంది.

పొత్తు పెట్టుకున్నా కూడా మెజార్టీ సీట్లు తమ పార్టీకే రావాలి. అంటే సొంతంగా అధికారం చేపట్టాలి. కనీసం 90 స్థానాల్లో గెలవాలంటే కనీసం 140-150 చోట్ల పోటీ చేయాలి. ఆ మిగిలిన స్థానాలను బీజేపీకి, జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ భావిస్తోంది. అవసరం అయితే పార్లమెంట్ స్థానాలు వదులుకునేందుకు సిద్ధంగా ఉంది కానీ.. అసెంబ్లీ స్థానాల్లో సర్దుకుపోవాలని సూచిస్తోంది.

అయితే బీజేపీ, జనసేన ఆలోచనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. టీడీపీతో గత అనుభవాల నేపథ్యంలో ఎక్కువ సీట్లు కనీసం 50కి పైగా జనసేన, బీజేపీలకే కావాలని పట్టుబడుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్ర కీలకం అవుతుంది. చంద్రబాబు ఒకవేళ యూటర్న్ తీసుకున్నా.. పవర్ తమ చేతిలో ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అప్పుడు చంద్రబాబు తమ చెప్పు చేతల్లో ఉంటారని కాషాయ దళం భావిస్తోంది. పవన్ కూడా ఇదే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల వ్యవహారం ఇంకా సాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: