జగన్ మళ్లీ గెలిస్తే.. బాబు వెనుక శక్తులకు చుక్కలే?

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా యాభై రోజుల సమయం ఉంది. ఈ సారి ఎన్నికల్లో అధికార వైసీపీ మరో సారి పాలన చేపడుతుందా.. లేక టీడీపీ,జనసేన కూటమి అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలు టీడీపీకి మాత్రం జీవన్మరణ సమస్య. పొరపాటున ఓటమి ఎదురైతే టీడీపీ ఉనికితో పాటు చంద్రబాబు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.

దీంతో చంద్రబాబుని నమ్ముకున్న వ్యవస్థలు, వ్యక్తులు సైతం దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబుకి మించి కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుకి మించి తపన పడుతున్నాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువగా ఆయన రాజ గురువు రామోజీపైనే దృష్టి సారించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు నమోదు చేయించారు. తద్వారా రామోజీ వ్యాపార విస్తరణకు చెక్ పెట్టారు.

దీంతో ఆయన జాతీయ స్థాయిలో నెలకొల్పిన మీడియా ఛానళ్లను రిలయన్స్ కు విక్రయించాల్సి వచ్చిందని చెబుతారు. అయితే కేసుల పరంగా రాజశేఖర్ రెడ్డి రామోజీ రావుపై ఉదారంగా వ్యవహరించారు. మరీ లోతుగా వెళ్లలేదు. కానీ జగన్ అలా కాదు. రామోజీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడంలో విజయవంతం అయ్యారని చెబుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వెనుక ఉండే వ్యవస్థలను, వ్యక్తులను దారుణంగా దెబ్బ తీశారు.

ముఖ్యంగా రాజధాని చుట్టూ జరిగిన వ్యవహారాలను పసిగట్టిన జగన్ ఆదిలోనే వాటికి చెక్ పెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు అనుంగు వ్యవస్థ, వ్యక్తులు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇది జరిగితే చంద్రబాబు మరింత శక్తిమంతంగా మారతారు.  అందుకే వ్యూహాత్మకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతోపాటు చంద్రబాబు కేసుల వ్యవహారం మరింత పటిష్ఠంగా ఉండే విధంగా చేయబోతారు. అందుకే చంద్రబాబు అనుచర గణం టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: