బీజేపీను ఢీకొట్టేందుకు రేవంత్ ఖతర్నాక్‌ వ్యూహం?

తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే  అని ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లి నమ్మించింది. రహస్యంగా ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని ప్రజలను నమ్మించింది. గతంలో బీజేపీ పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందనే ప్రచారం చేసి  ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఇప్పుడు మళ్లీ ఇదే అంశంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లనుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కాలు జారి కిందపడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ ఈ వారంలో దిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరగుతుంది. ఎజెండా ఎంటో తెలియక పోయినా.. కమలంతో పొత్తుల కోసమే ఆయన దిల్లీ వెళ్తున్నారు అనే ఒక ప్రచారాన్ని జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తోంది. ఈ ప్రచారం వల్ల బీఆర్ఎస్ కు కలిగే నష్టం కన్నా లాభమే ఎక్కువ. తటస్థ ఓటర్లు కారు గుర్తుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

కాకపోతే దీని ప్రభావం బీజేపీ పై గణనీయంగా ప్రభావం చూపుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో తొలిసారి కొడంగల్ లో పర్యటించిన ఆయన కోస్గిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలవి చీకటి ఒప్పందాలని ఆరోపించారు.

ఒకరు పొత్తంటారు.. మరొకరు లేదంటారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూస్తున్నాయని.. ఈ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఇరు పార్టీల నేతలు పొత్తు విషయాలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్ తేల్చి చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్  ఈ రెండు పార్టీలు ఒకటే అనే మౌత్ పబ్లిసిటీని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి లబ్ధి పొందాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: