ఆళ్ల.. ఆ రెండు సీట్లు జగన్‌కు కానుక ఇస్తాడా?

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలీదు అనేలా ఉంది నేతల తీరు. వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పులు నేపథ్యంలో టికెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీ లోకి చేరుతున్నారు. అయితే ఇలా అధికార  పార్టీ నుంచి జంప్ అయి మరో పార్టీలో చేరిన వారిలో ఆళ్ల రామకృష్ణరెడ్డి మొదటి వ్యక్తి.

ఈయన 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే  మంగళగిరి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కేని పక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆర్కే వైసీపీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపించారు.

మళ్లీ నెల తిరిగే లోపే తిరిగి సొంత గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైసీపీ అన్ని రకాలుగా నాకు అండగా నిల్చొంది. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కల్పించింది. రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2019లో ఏ విధంగా అయితే ఓసీ వర్గం చేతిలో నారా లోకేశ్ ఓటమి పాలయ్యాడో ఈ సారి అదేవిధంగా బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందడం తథ్యం.

పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం. విపక్షాల ప్రయత్నాలు ఫలించకూడదనే ఉద్దేశంతో తిరిగి వైసీపీలో చేరాను. మంగళగిరిలో వైసీపీ ఎవర్నీ నిలబెట్టినా గెలిపిస్తాను అని తెలిపారు. అయితే జగన్ ఆర్కేకి రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్ప జెప్పినట్లు తెలుస్తోంది. అవి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాలు. ఈ రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆర్కేకి జగన్ సూచించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: