ఆధారాలు రుజువు చెయ్ రామోజీ.. ఆస్తులు రాసిస్తా?

ఈనాడు పత్రికాధిపతి రామోజీరావుపై పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు. తాను క‌బ్జా చేశాన‌ని నిరూపిస్తే తన ఆస్తులు మొత్తం రాసిస్తాన‌ని కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి రామోజీ రావుకు స‌వాలు విసిరారు. ఈనాడు పత్రికలో మీ ఇష్టం వచ్చినట్లు వార్త‌లు రాస్తే మేము నిరసన కూడా తెలపకూడదా అని కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

తాము తప్పులు చేస్తే ఎత్తిచూపొచ్చని.. కానీ తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాద‌ని  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. నిజానిజాల్ని వదిలేసి మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోవడమే పత్రికా స్వేచ్ఛకు అర్ధమా అన్న  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి.. ఈనాడు పత్రికను అడ్డంపెట్టుకుని .. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారిపై కక్ష తీర్చుకోవడమనేది జర్నలిజం కాదు గదా అన్నారు. రియల్‌ ఎస్టేట్‌దార్లు వెంచర్లు వేసినప్పుడల్లా 10 శాతం కమీషన్‌ నాకిస్తున్నట్లు రామోజీ రాశారని.. ఎవరికీ తెలియని కొత్త సంస్కృతిని మీరు నేర్పుతున్నారా అని  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

మీ దగ్గర నాకు కమీషన్లు ఇచ్చినట్లు ఆధారాలుంటే వాటిని బయటపెట్టాలని.. లేదంటే, కమీషన్లు ఇచ్చామని చెప్పే రియల్టర్లను గానీ మా ముందుకు తెచ్చి రుజువు చేయించగలరా అని  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. నన్ను టార్గెట్‌ చేయడంలో తానేమీ బాధపడనన్న  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి.. నా కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయాల్లోకి లాగి తెలుగుదేశం పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని ఈనాడు దినపత్రిక అనుకుంటోందన్నారు.

ఈనాడు కార్యాలయంపై నిజంగా దాడి జరిగితే దాన్ని తాము కూడా సమర్ధించబోమని ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి అన్నారు. నిన్న తాను గడివేములలో వాలంటీర్‌ వందనం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన సమయంలో తమ కార్యకర్తలు కర్నూలు ఈనాడు కార్యాలయం ముందు నిరసన ధర్నా చేశారని తెలిసిందన్నారు. తమ నాయకుని కుటుంబం మీద లేనిపోని అబద్ధాలు అల్లి వార్తలు వచ్చినప్పుడు ఆమాత్రం నిరసన చేసే హక్కు కూడా వారికి లేదనుకుంటారా అని కాటసాని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఈనాడు వ్యక్తులు తాళాలు వేసుకుని ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: