దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం?

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే సింహ భాగం దక్కుతుంది అనే ఓ నానుడి ఉంది. ఇప్పుడు అది ఉత్తరాది విషయంలో నిజం అవుతుంటే మన విషయంలో మాత్రం అబద్ధమవుతుందని దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఆరోపిస్తున్నాయి. పన్నులు నిక్కచ్ఛిగా వసూలు చేస్తూ, తిరగి ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి.

ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం సోదరుడు డీకే సురేశ్ ఇటీవల స్వయంగా పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ కూడా సురేశ్ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసింది. తమ విధానం విభజించడం కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దిల్లీలో ధర్నా చేయడం విశేషం. కర్ణాటకకు మద్దతుగా తమిళనాడు అధికార పార్టీ నాయకులు దిల్లీలో నిరసనకు దిగారు.

ఈ విషయమై కేరళ కూడా త్వరలో ధర్నా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  తాము కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తుంటే కేంద్రం నుంచి తిరిగి 15 పైసలు మాత్రమే వస్తున్నాయని.. అదే ఉత్తర్ ప్రదేశ్ లో రెండు రూపాయలు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆదాయ పంపిణీ జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఆదాయ పంపిణీ జరుగుతుందని.. ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు నిధులు నాలుగింతలు అధికంగా వచ్చాయని కేంద్రం లెక్కలు చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: