అమిత్‌షా ఇచ్చిన షాక్‌ నుంచి బాబు ఇంకా కోలుకోలేదా?

బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ.. రాజకీయంగా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. చంద్రబాబు మూడు రోజుల క్రితం దిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తుల విషయమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. ఆ పార్టీని తిరిగి ఎన్డీయే కూటమిలోకి చేర్చుకునేందుకు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బీజేపీకి కేటాయించే సీట్ల వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.

అయితే అనూహ్యంగా చర్చల వ్యవహారం సహా పొత్తుల విషయం కూడా సైలెంట్ అయిపోయింది. పొత్తుల వ్యవహారం ఏమైందని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. పొత్తులపై  బీజేపీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కాషాయ దళం మనసు మార్చుకుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పొత్తుల వ్యవహారం చంద్రబాబు ఎవరితోను చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే దిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. సీనియర్ నేతలతో బీజేపీతో జరిగిన సమావేశం గురించి చర్చించలేదు.

అంటే చంద్రబాబే లోలోపల ఏదో విషయమై మదన పడుతున్నారని ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకుంటే దిల్లీ వెళ్లకముందు పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లు, నియోజవర్గాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. దిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా పరిణామాలు అన్నీ వేగంగా మారిపోయాయి. ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి.

అసలు అమిత్ షా ఏం అడిగారు.చంద్రబాబు ఏం ఇస్తా అన్నారు. ఒక్కటి మాత్రం ఖాయంగా చెప్పవచ్చు.  గతంలో మాదిరిగా చంద్రబాబు ఇస్తే తీసుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. ఆ పార్టీ చెప్పిన విధంగా వింటే పొత్తులకు అంగీకారం చెప్తుంది. లేకపోతే ఒంటరిగా అయినా పోటీకి సిద్ధం అవుతుంది. ఇంతకీ ఏం అడిగింది అనేది రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు.  పవర్ షేరింగ్ అడిగారా.. లేక పవన్ కల్యాణ్ ను సీఎం చేయమని కోరారా.  ఏంటనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా పొత్తుల వ్యవహారం టీడీపీలో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: