మోదీని చంద్రబాబు, పవన్ అది అడగరేంటి?

ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. 2014 పొత్తులు రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరేళ్ల విరామం తర్వాత టీడీపీ ఎన్డీయేలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అటు బీజేపీ సైతం ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ మూడు పార్టీల కలయిక వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేశాయి. జనసేన బయట నుంచే మద్దతు ప్రకటించింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఎన్డీయే ప్రభుత్వాలు నడిచాయి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని సాకుగా చూపి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. అంతకు ముందే హోదా ఏమైనా అపర సంజీవనా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు జనగ్ ప్రత్యేక హోదా పల్లకి ఎత్తుకోగానే అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు.

అటు పవన్ సైతం ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై ఒత్తిడి పెంచారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక నిధులను పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. 2019  ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ, జనసేనలు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఎన్నికల అనంతరం పవన్ బీజేపీతో జత కలిశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం ఎన్డీయే కూటమివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటు చంద్రబాబు.. పవన్ కు ప్రత్యేక హోదా గుర్తుకురాకపోవడం విశేషం. గతంలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని విభేదించింది.. ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో చెప్పడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. తొలి ఫైల్ పై సంతకం పెడతామని తేల్చేవారు.  మరి ఈ సమయంలో చంద్రబాబు, పవన్ లు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ వైపు వెళ్లాలి కదా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ పలుసార్లు స్పష్టం చేసింది. దీనిని బట్టి రాజకీయ పార్టీలకు రాజకీయ అవసరాలే తప్ప ప్రజా సమస్యలు పట్టవు అనేది అవగతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: