సీఎంగా ఎవరున్నా.. ఏపీలో మోడీ రాజ్యమేనా?

గతంలో మాజీ సీఎం కేసీఆర్ నిత్యం బీజేపీని, ప్రధాని మోదీ విమర్శించేవారు. తానే దేశానికి ప్రత్యామ్నాయం అనే స్థాయిలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అని భావించి ఆ పార్టీకి కళ్లెం వేశారు. కానీ అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకొని అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కానీ ఆంధ్రాలో పరిస్థితి పూర్తి భిన్నం. ఏపీలో బీజేపీని విమర్శించే వారే కరవయ్యారు.

కానీ ఏపీలో వైఎస్ షర్మిళ ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మాటలతో వైసీపీని ఇరకాటంలో పడేస్తోంది. ఇదే సందర్భంలో టీడీపీ ని విమర్శిస్తున్న వైసీపీ రేంజ్ లో మాత్రం కాదు. మరోవైపు బీజేపీ లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ఆ పార్టీని ఢిపెన్స్ లో పడేస్తోంది. ఏపీలో అటు వైసీపీ కానీ.. ఇటు టీడీపీ కానీ బీజేపీని విమర్శించే సాహసం చేయవు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఎన్డీయే కూటమిలో లేవు. ఇలాంటి పరిస్థితి ఏపీలో మినహా మరెక్కడా ఉండదేమో..

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రంలోని బీజేపీ పక్కన పడేసింది. ఇది సహజంగా ఏపీ ప్రజలకు మింగుడు పడని అంశం.  దీంతో ఆ పార్టీపై వ్యతిరేకత ఉంది. కానీ ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నాన్ని అటు వైసీపీ.. ఇటు టీడీపీ రెండూ చేయవు. కానీ ఏపీసీసీ  అధ్యక్షురాలు షర్మిళ ఏ మాత్రం తడబాటు లేకుండా మోదీపై, కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

ఆంధ్రా ప్రజలు ఒక్క ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం నడుస్తోందని షర్మిళ ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు 25మంద బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కారు, ఏపీలోని వైసీపీ, టీడీపీ ద్రోహం చేస్తున్నాయని..ఏపీ హక్కులను కాలరాస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: