రేవంత్‌రెడ్డి.. సోమేశ్‌ కుమార్‌ను అరెస్టు చేయిస్తారా?

తెలంగాణ మాజీ సీఎస్, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు సోమేశ్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులో కొత్తపల్లి  గ్రామంలో ఫార్మాసిటీ వస్తుందనే ముందుగానే తెలుసుకున్న సోమేశ్ కుమార్ అక్కడ ఆయన భార్య పేరిట 25 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆయన బంధువులతో మరో 125 ఎకరాలు కొనిపించారు. ఇక ఇక్కడ ఆయన కొనుగోలు చేసిన భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఎకరా కేవలం రూ.2.5లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంత తక్కువ ధరకు భూములు కొనడానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పటికే విజిలెన్స్ ఆరా తీస్తోంది. క్విడ్ ప్రోకో జరిగి ఉంటుందని అనుమానిస్తోంది. ఈ మేరకు విచారణ జరుగుతుండగానే మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 25.19 ఎకరాల భూమికి సోమేశ్ కుమార్ రైతు బంధు కింద రూ.14లక్షలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. సోమేశ్ కుమార్ కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ యోగ్యమైనది కాదు. మొత్తం రాళ్లు, గుట్టలతోనే ఉంది. ఒక్క పంట కూడా సాగు చేయలేదు. అయినా ఆ భూమికి ఆరు నెలలకు ఓసారి రూ.1,27,375 చొప్పున ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ భార్య ఖాతాలో రూ.14లక్షలు రైతుబంధు జమైంది.

వాస్తవంగా అయితే భూముల కొనుగోలుతో పాటు రైతుబంధు తీసుకున్న విషయాన్ని సోమేశ్ కుమార్ దిల్లీలోని డీవోపీటీకి సమాచారం ఇవ్వాలి. కానీ ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. ఈయన తరహాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్యూరోక్రాట్లు ఫామ్‌హౌస్‌లు, భూములు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కారు మాజీ సీఎస్ పై కేసులు పెట్టి ఆయన్ను అరెస్టు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: