జగన్‌పై కక్షతో విజయసాయిని టార్గెట్ చేశారా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంటెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. జగన్ అవినీతి కేసుల్లో ఆయన కూడా జైలు జీవితం గడిపారు. అయితే ఆయన వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్థారించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన గ్రూపు కంపెనీలకు ఆర్థిక సలహాదారుడిగా విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది.

వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరు కావాలని అక్టోబరు 23న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో.. హెటిరోలకు భూ కేటాయింపులు, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు, రాంకీ ఫార్మా వాన్ పిక్, దాల్మియా సిమెంట్స్ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాలను, అందులో సాక్షుల వాంగ్మూలాలను ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ పరిగణనలోకి తీసుకొని ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించింది.

జగన్ తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి చురుకైన పాత్ర పోషించారని ఐసీఏఐ పేర్కొంది. ఆయన డైరెక్టర్ గా రాజీనామా చేసిన తర్వాత కూడా ఓ కంపెనీతో సన్నిహితంగా ఉండి పెట్టుబడులు రాబట్టారు. ఈ సమయంలో ఆయన ప్రాక్టిసింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారు. వృత్తిపరమైన సేవలు అందించడంలో ఆయన ఇలా చేయాల్సింది కాదని పేర్కొంది.

అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయి నిందితుడిగా ఉన్నారు.  ఆ కేసు జడ్డిమెంట్ రాకుండానే అసోసియేషన్ వాళ్లు ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఏ సీఏ మీద కూడా కేసు నమోదు చేయకుండా కేవలం విజయసాయి నే టార్గెట్ చేశారన్న విమర్శలున్నాయి. జగన్ ను దెబ్బకొట్టేందుకు విజయసాయిని వాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: