ఆ ఊహే.. చంద్రబాబును వణికిస్తోందా?

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలుపోటములపైనే టీడీపీ ఉనికి ఆధారపడి ఉంది. గెలిస్తే చంద్రబాబుకి గౌరవప్రదమైన పదవీ విరమణ లభించనుంది. లేకుంటే మాత్రం చంద్రబాబు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అందుకే ఆయన వయసుకు మించి కష్టపడుతున్నారు. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం ముచ్చెమటలు పట్టడం ఖాయం.

జగన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో చంద్రబాబుకి తెలయంది కాదు. గత నాలుగేళ్లుగా చంద్రబాబుపై రీవెంజ్ తీసుకోవాలని జగన్ భావించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట అవినీతి కేసులు మోపగలిగారు. సీఐడీ ని అడ్డం పెట్టుకొని చంద్రబాబుని అరెస్టు చేశారు. రిమాండ్ కు పంపగలిగారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే మునుపెన్నడూ లేని విధంగా పట్టు బిగించడంలో జనగ్ విజయవంతం అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసులు నమోదు చేసినా రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబుని టచ్ చేయలేకపోయారు. ఆయన విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు.

కానీ జగన్ అలా కాదు. సరైన టైమ్ చూసి స్కెచ్ వేశారు. కేసులతో చంద్రబాబు ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వెనుక తనపై ఉన్న కేసులే కారణం. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై ఉన్నారు. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థ. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే తన పై కేసులన్నీ విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.

పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడు కోర్టు పరిధిలో  నడుస్తున్న కేసులపై పట్టు బిగించే అవకాశం లభిస్తుంది. అది చంద్రబాబుకి శ్రేయస్కరం కాదు. 74 ఏళ్ల వయసులో మరో అయిదేళ్లు మాత్రమే క్రియాశీలకంగా రాజకీయాలు చేయగలరు. ఇంతలో జైలు జీవితం పలకరిస్తే అది ఆయన జీవిత చరిత్రకు ఒక మాయని మచ్చలా మారుతుంది. అందుకే చంద్రబాబు తన శక్తికి మించి ఈ ఎన్నికల్లో కష్టపడుతున్నారు. జనసేనతో పొత్తుకు, కేంద్రంతో సహకారానికి వెంపర్లాడుతున్నారు. ఇన్ని ప్రయత్నాల వెనుక కేసుల భయం చంద్రబాబుని వెంటాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: