భారత్ గొప్పదనం ప్రపంచానికి చాటిన ఎలాన్‌ మస్క్‌?

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి ప్రయత్నాలను చాలా ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పిచాలన్న డిమాండ్ కు మద్దతు ప్రకటించాయి. అయితే భారత్ ప్రయత్నాలను చైనా వంటి కొన్ని దేశాలు దుర్బుద్ధితో అడ్డుకుంటున్నాయి.

ఇటీవల ఈ అంశంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నప్పటికీ భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అధిక శక్తి కలిగిన వారు దాన్ని వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే సమస్యగా మస్క్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

అయితే భద్రతా మండలిలో సంస్కరణలపై చర్చల్లో పురోగతి లేకపోవడం పట్ల పలు  సందర్భాల్లో ప్రపంచ వేదికలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదుగురు శాశ్వత సభ్యులు, పది మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి తాత్కాలిక సభ్యులు ఎన్నుకోబడతారు.

భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యులు రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అమెరికా.. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక తీర్మానంపై వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఈ వీటో అధికారంతోనే చైనా భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనలను అడ్డుకుంటోంది. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎలన్ మస్క్ మద్దతుగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఏంటని పలు దేశాలు ప్రశ్నిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: