రాజ్యసభ ఎన్నికలు.. జగన్ ఎత్తు ఫలిస్తుందా?

రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో సీఎం జగన్ అనుసరిస్తున్న వేటు వ్యూహం అంత తేలికగా ఫలించేలా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాదిరి సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేటు చేస్తారనే అనుమానంతో ప్రత్యర్థి పార్టీ టీడీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యగా  ఫిరాయింపు ఆలోచన ఉన్న వారిపై వేటు వేయాలని వైసీపీ భావిస్తోంది.

కానీ వైసీపీ మొదలు పెట్టిన కసరత్తు అనుకున్నది అనుకున్నట్లు సాగే అవకాశం కనిపించడం లేదు. రెబల్ గా మారిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకరు నోటీసులు జారీ చేశారు. మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో వారు రాసిన ప్రత్యుత్తరం గమనిస్తే.. జగన్ ఎత్తుకు చంద్రబాబు వేసిన పై ఎత్తులా కనిపిస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు, ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఒక్కో ఎంపీకి 44మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 151 సీట్లు ఉన్న వైసీపీకి 132 ఓట్లు చాలు. మూడు సీట్లను వారు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ జగన్ ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఛాన్స్ తీసుకునే ఉద్దేశంలో లేనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్రోహం చేసిన వారికి స్పీకర్ ద్వారా నోటీసులు పంపించారు. తాజాగా వారు మాకు సమాధానం చెప్పడానికి రెండు నెలల సమయం కావాలని స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈలోగా రాజ్యసభ ఎన్నికల క్రతువు పూర్తవుతుంది. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, లేఖలు రాయగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ సర్టిఫికేట్ కూడా జోడించారు. ఒకవేళ స్పీకరు త్వరగా వేటు వేసినా..  వారు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. హైకోర్టులో తేలే వరకు వాళ్లు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టే జగన్ వేటు వ్యూహం ఫలించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: