షర్మిల.. చంద్రబాబు ప్రయోగించిన బాణమేనా?

ఏపీలో లెక్కలు మారుతున్నాయి. సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరి పోరుకు సిద్ధం అయిన జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60మంది అభ్యర్థులను మార్చారు. మరో 20మందిని మార్చుతారని సంకేతాలు ఇస్తున్నారు. తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. మధ్యలో బీజేపీ జత కలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిళ తీసుకున్నారు. సోదరుడు జగన్ లక్ష్యంగా తీసుకొని విమర్శలు చేస్తున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా విమర్శలు చేస్తున్నారు కానీ టీడీపీ నేతలెవరూ స్పందించడం లేదు. ఈ పరిణామాల క్రమంలో జగన్ ఒక వైపు విపక్షాలు మరోవైపు అన్న పరిస్థితి ఏపీలో నెలకొంది. కాంగ్రెస్ లో షర్మిళ చేరిక సంచలనం కాకపోయినా ఒకప్పుడు విమర్శించిన పార్టీ నీడకే తిరిగి చేరారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు వైఫల్యాలపై, ప్రజా ప్రతినిధులు దోపిడీ, అవినీతి గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు. నేరుగా జగన్ రెడ్డి అని సంబోధిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

దీనిపై వైసీపీ నేతలు స్పందించినా సీఎం జగన్ కూడా నేరుగా షర్మిళపై విమర్శలు చేస్తారా అనే ప్రశ్న అందరిలోను ఉంది. అందుకు అనుగుణంగానే  అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్ చంద్రబాబు ఏ మంచి పని చేయకున్నా ఆయనకు చాలామంది స్టార్ క్యాంపెయినర్ లు ఉన్నారని.. కొంతమంది రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో కూడా చేరారని షర్మిళను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.

అయితే జగన్ షర్మిళను నేరుగా విమర్శించకుండా ఆ నెపాన్ని కాంగ్రెస్, చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కోసం కుటుంబాన్ని చీల్చుతున్నారని.. గతంలో మా బాబాయ్ విషయంలో ఇదే జరిగింది అని ప్రస్తుతం షర్మిళ విషయంలోను తప్పు కాంగ్రెస్ దే అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నా కుటుంబాన్ని చీల్చారు అనే సానుభూతితో జగన్ ఈ సారి జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: