అయోధ్యతో ఉత్తర్‌ప్రదేశ్‌కు అంత ఆదాయమా?

దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక స్థలాలది ఎంతో కీలక పాత్ర. విహార స్థలాలకు వెళ్లేందుకు ఆర్థికంగా స్తోమత చాలని వారు కూడా ఏడాది రెండేళ్లకు ఓ సారి తాము నమ్మే పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబం అంతా కలిసి వెళ్తుంది కనుక రవాణా రంగంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలకు గిరాకీ పెరుగుతుంది. పలు రంగాలకు ఆదాయం అధికమై పన్నుల రూపేణా ప్రభుత్వాలకు ఆదాంయ లభిస్తోంది.

తాజాగా ముగిసిన రెండు నెలల యాత్రల ఫలితంగా శబరిమల అయ్యప్ప ఆలయానికే రూ.357 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.  500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరింది. అయోధ్యలో కొలువైన బాల రాముడిని చూసేందుకు భక్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అయోధ్య లో రామమందిర నిర్మాణంతో ఉత్తర్ ప్రదేశ్  రూపురేఖలు మారుతాయంటున్నారు. దేశంలోని ఆధ్యాత్మిక టూరిజంలో ఇది సింహ భాగం వహించనుందని అంచనా వేస్తున్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం వల్ల జరిగే వ్యాపార కార్యకలాపాలు సుమారు రూ.4లక్షల కోట్ల వరకు  ఉంటుందని బిజినెస్ టుడే అంచనా వేసింది. దీంతో పాటు ఎస్ బీఐ  రీసెర్చి నివేదిక ప్రకారం అయోధ్య రామాలయ నిర్మాణం, ఇందుకనుగుణంగా తీసుకుంటున్న అదనపు చర్యల వల్ల 2024-25లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.25వేల కోట్లు ఆదాయం లభించే వీలుంది. ముఖ్యంగా సందర్శకుల రాక వల్లే అధిక మొత్తం సమకూరునుంది. వీరి రాకపోకలకు అనుగుణంగా రైలు, రోడ్డు, వాయు రవాణా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

2022లో ఉత్తర్ ప్రదేశ్ ను 32 కోట్ల మంది సందర్శిస్తే అందులో అయోధ్యకే 2.21 కోట్ల మంది వచ్చారు. వీరి మొత్తం వ్యయాలు 2లక్షల కోట్లని నివేదిక తెలిపింది. 2027 కల్లా మహారాష్ట్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా 500బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తోందని.. దేశ జీడీపీలో దీని వాటా 10శాతం ఉంటుందని పేర్కొంది. అయోధ్యలో పర్యాటకుల కోసం హోటళ్లు, గదులు నిర్మాణాల కోసం స్థలాల కొనుగోళ్లు అధికమయ్యాయి. ప్రధాన ఆలయానికి 5-10 కి.మీ. దూరంలో గజం 2లక్షల వరకు పలుకుతుంని పలు నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: