జగన్‌.. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే పెద్ద దెబ్బే?

సొంతింట్లో ఉండాలనేది ప్రతి పేదవాడి కల. తాము అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేదకు సొంతింటికల సాకారం చేస్తామని ప్రతి పక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తున్నాం.. పేదల సొంతింటి కల సాకారమైంది అంటూ లబ్ధిదారులకు ఇంటి రిజిస్ర్టేషన్ పత్రాలు ఇచ్చి చేతులు దులుపు కున్నారు.

అయితే టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతులపై ప్రభుత్వం ఓ సర్వే చేస్తే వాస్తవాలు తెలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.  దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అయినా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినా ఊరికి దూరంగానే పేదలకు కాలనీలు నిర్మించారు. కాకపోతే అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. పక్కా సిమెంట్ రోడ్లు, విద్యుత్తు సౌకర్యం, తాగునీటి వసతి వంటివి కల్పించేవారు.

అయినా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో ఓట్లు  పడ్డాయా అంటే లేదు. కారణం నిర్మాణాల్లో నాణ్యత లోపం. దీనిని అధిగమించేందుకు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇల్లు నిర్మించుకునేవారికి డబ్బులు ఇస్తున్నారు.  గ్రామాల్లో అయితే రూ.లక్షా ఎనభై వేలు, పట్టణాల్లో అయితే రూ. రెండు లక్షల ఎనభై వేలు వారి ఖాతాకే నగదు జమ చేస్తున్నారు. కానీ ఇంటి స్థలం లేని వారికి ఊరి చివర స్థలం సేకరించి కాలనీలు నిర్మించి ఇస్తున్నారు.

అయితే అక్కడ వసతులు కల్పించడంలో జగన్ సర్కారు వైఫల్యం చెందుతోంది. గతంలో టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను వైసీపీ సర్కారు పూర్తిగా విస్మరించింది. దాదాపు చాలా చోట్ల స్తంభాలకు వీధి దీపాలనే అమర్చలేదు. కరెంటు, నీటి సదుపాయాలు లేకపోవడంతో ఇళ్లలోకి వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపి వాటిని పూర్తిగా విస్మరించడం సరికాదు. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత వైసీపీ సర్కారుపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: