ఆంధ్రాలో కొత్త నినాదంతో కాంగ్రెస్ వ్యూహం?
టీడీపీ పాలన హయాంలోనే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పారు. కానీ 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకువస్తానని అప్పటి ప్రతి పక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. అడిగనట్లు గానే 23 స్థానాల్లో ఆ పార్టీ ఎంపీలను ప్రజలు గెలిపించారు. అయితే జగన్ ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు.
కేంద్రంలోని సర్కారు అత్తెసరు సీట్లతో ఉంటే మనం డిమాండ్ చేసేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు అంటూ సీఎం జగన్ తెలివిగా తప్పుకున్నారు.ప్రత్యేక హోదా అనే అంశమే లేదు. నీతి ఆయోగ్ ద్వారా నిధులు ఇస్తున్నాం అని కేంద్రం చెబుతోంది.
ప్రస్తుతం ఎన్నికలకు చేరువవుతున్న వేళ ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోంది. అందుకే షర్మిళ ను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి రాకపోవచ్చు కానీ పార్టీకి అయితే కొంతమేర పూర్వ వైభవం వస్తోందనే గట్టి నమ్మకంతో హస్తం పార్టీ ఉంది. అందులో భాగంగానే మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మాట్లాడారని.. తద్వారా అటు బీజేపీకి ఇటు వైసీపీకి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.