బాబు అరెస్ట్‌: టీడీపీ భారీగా పుంజుకుంటోందా?

ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోంది. దీంతో సర్వేల సందడి షురూ అయింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి… ఎంత శాతం ఓటింగ్ నమోదు అవుతుంది. ఏ పార్టీది అధికారం అంటూ సర్వే ఫలితాలు ఊదరగొడుతున్నాయి. తాజాగా ఇండియా టీవీ సుమన్స్ సర్వే పలు రాష్ట్రాల ఫలితాలను వెల్లడించింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పోటాపోటీ తప్పదని తేల్చింది. రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి ద్విముఖ పోరు సాగుతున్న వేళ సర్వే ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జగన్ నేతృత్వంలోని వైసీపీకి 15 లోక్ సభ స్థానాలు, టీడీపీకి 10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2019తో పోల్చితే వైసీపీ 7 స్థానాలు కోల్పోనుండగా.. టీడీపీ ఆ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. ఓట్ల శాతానికి వస్తే వైసీపీకి 46 శాతం, టీడీపీకి 42 శాతం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విషయానికొస్తే అధికార బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో 9 సీట్లు రాగా ఈ సారి ఒక స్థానం కోల్పోయి ఎనిమిదింటితో సరిపెట్టుకుంటుందని చెప్పింది. కాంగ్రెస్ కు 2, బీజేపీకి మాత్రం 6 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని తెలిపింది.

దేశంలో ఇతర రాష్ట్రాల పరిస్థితి చూస్తే 282 సీట్లలో చేసిన సర్వేలో ఎన్డీయే కూటమికి 118, ఇండియా కూటమికి 110 సీట్లు వస్తాయని తెలిపింది.  బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోను బీజేపీ తన హవా కొనసాగిస్తుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 10, తృణమూల్ కాంగ్రెస్ కు 36 స్థానాలు, రాజస్థాన్ లో బీజేపీకి 23, కాంగ్రెస్ కు 2, ఛత్తీస్ గఢ్ లో బీజేపీకి 7, కాంగ్రెస్ 4, తమిళనాడులో డీఎంకే 21 , అన్నా డీఎంకే 6 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: