అసెంబ్లీ బరిలో అధికారి.. కేసీఆర్ టిక్కెట్ ఇచ్చేశారా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తన స్వచ్చంద సంస్థ సేవ పేరుతో కొత్త గూడెంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం కేసీఆర్ ను అడిగారని దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇలా క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగడం వల్ల ఆయనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు.
శ్రీనివాస్ సీఎం కేసీఆర్ కాళ్లు బహిరంగంగానే మొక్కడం కూడా ఆ మధ్య సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఇలా చేయడం వెనక పెద్ద మతలబు ఉందని ఆరోపించాయి. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా చేసిన వెంకట రమణా రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట కలెక్టర్ గతంలో రైతులపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలతో సత్సంబంధాలు పెట్టుకుని ప్రజల ను పట్టించుకోవడం లేదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
శ్రీనివాస్ తనకు కావాల్సిన సమయంలో టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. అంతకుముందు ప్రజల్లోకి వెళ్లి తానెంటో నిరూపించుకోవాలని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నికల నాటికి ఎంతమంది అధికారులు ఆయా పార్టీల టికెట్ల కోసం వెంట పడతారో చూడాలి. ఏదైమైనా ఐపీఎస్, ఐఏఎస్ లు రాజకీయ నాయకుల వద్ద మోకారిళ్లడం అనేది సరైనది కాదని ప్రజల్లోకి ఈ విషయం వెళ్లడం ద్వారా అధికారులంటే చిన్న చూపు వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.