పోలవరం.. తెలంగాణ తీరుపై ఏపీ గరంగరం?

హైదరాబాద్‌లో తాజాగా జరిగిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశంలో ఏపీ అధికారులు తెలంగాణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గోదావరి ముంపు ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేయడంపై ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేశాకే పోలవరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని.. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, ఎవరూ అంగీకరించలేదని శశి భూషణ్ కుమార్ అన్నారు.

ఉమ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏదీ ఉండదన్న శశి భూషణ్ కుమార్.. జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు రావడం పిల్లచేష్టలు కాదు కదా అని ప్రశ్నించారు. ఎప్పటి వరకు అధ్యయనం చేసుకుంటూ పోవాలి.. నచ్చినట్లు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా అని శశి భూషణ్ కుమార్ అడిగారు. తెలంగాణ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి సమాధానం ఇస్తామని పీపీఏ స్పష్టం చేసిందని.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం ఉంది. ఎలాంటి తాత్కాలిక, శాశ్వత ఉత్తర్వులు రాలేదని శశి భూషణ్ కుమార్ తెలిపారు.

అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు తెలిపిందన్న శశి భూషణ్ కుమార్... రెండు సమావేశాలు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని తెలిపారు. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖా మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తారని శశి భూషణ్ కుమార్ చెప్పారు. భూసేకరణపై కూడా పీపీఏ సమావేశంలో చర్చ జరిగిందని.. రెండో దశలో మరో 30 నుంచి 40 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని శశి భూషణ్ కుమార్ అన్నారు.

భూసేకరణ కోసం షెడ్యూల్ సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేస్తామన్న శశి భూషణ్ కుమార్., పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని అందరూ కోరుతున్నారన్నారు. రాజమహేంద్రవరంలో వసతి కోసం పరిశీలిస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: