జగన్ మళ్లీ.. 'గాలి'కి వెల్‌కమ్‌ చెబుతున్నారా?

గాలి జనార్థన్ రెడ్డి.. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఈ పేరు బాగా వినపడింది.  ఆ కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆయన పేరు పెద్దగా ఏపీలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మళ్లీ జగన్ సర్కారు అనుమతులు ఇస్తోందని కొన్ని పత్రిక్లలో వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

గాలి జనార్థన్‌రెడ్డికి గనులు అప్పగిస్తున్నారంటూ రాశాయన్న అంబటి రాంబాబు... నిజానికి ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులు, అక్కడి గనులపై కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించటానికి సాక్షాత్తూ సుప్రీంకోర్టే, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాల్సిందిగా ఆదేశించిందని గుర్తు చేశారు. ఆ కమిటీ సర్వే చేసిందని, సర్వే చేసి ఒక రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు సమర్పించిందని అన్నారు.

ఇది సరిహద్దుల నిర్ణయానికి సంబంధించిన కమిటీ కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసిన ఈ సర్వేని రెండు రాష్ట్రాలూ ఆమోదించాయని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. అంటే ఆమోదించిందీ.. గాలి జనార్థనరెడ్డి గనులనా లేక రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులనా అన్నది పాఠకులకు చెప్పకుండా ఆ రెండు పత్రికలు ఏవో గాలి రాతలు రాశారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించి, సుప్రీంకోర్టు, సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా వంటివారు ఆమోదించిన నేపథ్యంలో ఆ నివేదికకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే.. అది గాలి జనార్థన రెడ్డిది ఆమోదం తెలపటం అవుతుందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ఈ నిజాలన్నీ తెలిసి కూడా, గాలి జనార్థనరెడ్డికి,  రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదో జరిగిపోతుందన్నట్టు ఒక వార్త రాయడాన్ని జర్నలిజం అంటారా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. లేకపోతే..  దోచుకో, పంచుకో, తినుకో.. స్కీమ్‌ ప్రకారం ఆ పత్రికకు కలిగిన కడుపు మంట అంటారా అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: