మహోగ్ర గోదారి: 36 ఏళ్లలో ఎన్నడూ చూడని దృశ్యం?

గోదావరి మహోగ్ర గోదావరిగా మారుతోంది. ఉగ్ర రూపం దాలుస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ  పెరుగుతోంది.  ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ  చెబుతోంది.

ప్రత్యేకించి భద్రాచలం వద్ద గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ చూడనంత వరద కనిపిస్తోంది. భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి 70 అడుగులు దాటింది. ఇది 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఆరు సార్లు గోదావరి నీటి మట్టం 60అడుగులు దాటింది. అలాగే చరిత్రలో ఇప్పటి వరకూ రెండు సార్లు 70అడుగులు దాటింది. భద్రాచలం వద్ద 1976లో 63.9అడుగుల నీటి మట్టం వచ్చింది. భద్రాచలం వద్ద 1983లో 63.5అడుగుల నీటి మట్టం వచ్చింది.

భద్రాచలం వద్ద 1986లో 75.6అడుగుల నీటి మట్టం వచ్చింది. భద్రాచలం వద్ద 1990లో 70.8అడుగుల నీటి మట్టం రాగా.. 2006లో 66.9అడుగుల నీటి మట్టం వచ్చింది. భద్రాచలం వద్ద 2013లో 61.6అడుగుల వరద వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. చివరగా భద్రాచలం వద్ద  2020లో 61.5అడుగుల నీటి మట్టం రికార్డయ్యింది. మళ్లీ ఇప్పుడు 70 అడుగులు దాటింది. ఈ భద్రాచలం వరద ప్రభావం ఏపీలోని 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేకించి కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4, ఏలూరులో 3, కాకినాడలో 2 మండలాలపై వరద ప్రభావం ఉంది. వరద ఉద్ధృతం అవుతున్నందున అదనపు సహాయక బృందాలు ఏర్పాటు చేశాయి. సహాయక చర్యల కోసం  మొత్తం 10 NDRF,10 SDRF బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు ఏపీలోని ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితమైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ 62వేల337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించామంటున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: