వాళ్లతో పెట్టుకోవడం.. టీడీపీకి మంచిదేనా?

రాష్ట్రంలో అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించే పోలీసులు అధికారును వదిలిపెట్టేది లేదని టీడీపీ వార్నింగ్ ఇస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీన వర్గాలపై దాడే అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అసలు జగన్ రెడ్డికి అయ్యన్న కుటుంబ చరిత్ర తెలుసా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అ‌య్యన్నపాత్రుడు అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అయ్యన్నపాత్రుడు  కావాల్సిన అన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

బలహీన వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడి కుటుంబం పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. అర్థరాత్ర వేళ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చడాన్ని ప్రజలందరూ గమనించారన్న అచ్చెన్నాయుడు.. అధికారులకు రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా అని నిలదీశారు. అర్థరాత్రి, ఇంటిని కూల్చడానికి నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి మణికంఠకి చట్టాలు తెలుసా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తామన్నారు. ఈ పరిస్థితే వారికి వస్తే.. వారెంత బాధపడతారో వివరిస్తూ లేఖ రాస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అయితే అచ్చెన్నాయుడే కాదు.. ఇటీవల టీడీపీ నాయకులు అంతా ఇలాగే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే.. పోలీసులే కాదు.. ఇతర అధికార యంత్రాంగం కూడా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు.. గతంలో టీడీపీ అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత కంటే భిన్నంగా వ్యవహరించ లేదు కదా. అలాగని అధికార దుర్వినియోగాన్ని ఎవరూ ప్రోత్స హించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: