వైసీపీకి మైనస్‌గా అన్న క్యాంటీన్‌ గొడవ?

జగన్ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసి వేయించారు. పేదవాడికి రూ.5 కే భోజనం దక్కే ఈ పథకం మూసి వేయించడం వివాదాస్పదం అయ్యింది. అయితే.. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్మించిన అన్న క్యాంటీన్ ను కూడా కూలగొట్టించడం వివాదాస్పదం అవుతోంది. అన్న క్యాంటీన్‌ను పొక్లైన్ తో కూలగొట్టిన పోలీసులు.. అడ్డుపడిన తెదేపా నేతలను అరెస్టు చేశారు.

ఈ క్యాటీన్‌ను గురువారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ అధికారులు మొదటిసారి కూలగొట్టారు. అయితే మళ్లీ తెదేపా నేతలు దగ్గరుండి నిర్మించారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి నిర్మాణ పనులను కొనసాగించారు. అయితే.. ఈ పనులు పూర్తైన వెంటనే మరోసారి నగరపాలక సంస్థ అధికారులు వచ్చారు. ఈసారి పోలీసులతో వచ్చి అనుమతి లేకుండా నిర్మించిన క్యాంటీన్ ను తొలగించాలని చెప్పారు. తొలగించేందుకు టీడీపీ నేతలు ఏమాత్రం ఒప్పుకోలేదు.

దీంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేసి క్యాంటీన్ను తొలగించారు. అయితే.. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా శుక్రవారం అన్న క్యాంటీన్ ప్రారంభించి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు..ఈ క్యాంటీన్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. గతంలో మంగళగిరిలోనే అప్పటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుటి ఎమ్మెల్యే ఆర్కే రాజన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. దాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అడ్డుకోలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు తాము సొంత నిధులతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం తొలగించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్న రీతిలో జగన్ సర్కారు వైఖరి ఉందని విమర్శిస్తున్నారు. అయితే.. ఇక్కడ టీడీపీ నేతల తప్పు కూడా ఉంది. నిజంగా అన్న క్యాంటీన్‌ పెట్టాలనుకుంటే.. ప్రైవేటు స్థలంలో పెట్టుకుంటే ఇబ్బంది ఉండేది కాదు.. కానీ.. రహదారి పక్కన విగ్రహం వద్ద ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అలా కాకుండా వేరే స్థలంలో ఏర్పాటు చేసుకుంటే బావుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: