గ్రూప్‌ వన్‌ పరీక్ష వాయిదా పడుతుందా?

గ్రూప్‌ వన్ పరీక్ష వాయిదా పడుతుందా.. ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో తలెత్తుతున్న సందేహం ఇది. జూన్‌ 4లో గ్రూప్ వన్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయింది..ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 4 లక్షల మంది వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్‌లో గ్రూప్‌ వన్ ప్రిలిమ్స్ జూలై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే ముందు అనుకున్న సమయానికి ప్రిలిమ్స్ జరగకపోవచ్చు.


ఎందుకంటే.. గ్రూప్ వన్‌ సిలబస్ చాలా ఎక్కువ.. కేవలం మూడు నెలల ప్రిపరేషన్ సమయం సరిపోదని చాలా మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని కలిసి పరీక్షను కనీసం నెల, రెండు నెలలు  వాయిదా వేయాలని కోరుతున్నారు. రోజూ చాలా మంది విద్యార్థులు గ్రూపులుగా వెళ్లి టీఎస్‌పీఎస్సీ ఆఫీసులో విజ్ఞప్తులు ఇచ్చి వస్తున్నారు. అయితే ఈ విజ్ఞప్తులను కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.


దీనికి తోడు ఆగస్టులో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్‌ లో సివిల్స్ మెయిన్స్‌ పరీక్ష కూడా ఉంది. ఇలా వరుస పరీక్షలు ఉండటంతో రెండు, మూడు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కమిషన్ ముందుగా పేర్కొన్నట్టు జూలైలో పరీక్షలు నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కమిషన్‌ వర్గాలు కూడా అనధికారికంగా ఇదే విషయం చెబుతున్నట్టు తెలుస్తోంది.


కాకపోతే.. నోటిఫికేషన్‌లో జూలై లేదా ఆగస్టు అని చెప్పినందువల్ల ఆగస్టులోనే ప్రిలిమ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. గ్రూప్ వన్ ప్రిపరేషన్‌కు అవసరమైన తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా చాలా ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే పరీక్ష వాయిదాపై ప్రస్తుతం వస్తున్నవన్నీ ఊహాగానాలుగా మాత్రమే పరిగణించాలి.. ఎప్పుడు పరీక్ష నిర్వహిచినా సిద్ధంగా ఉండేలా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ వాయిదా పడినా దాన్ని ప్రిపరేషన్‌ కోసం దక్కిన అవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: