జంధ్యం లేని బ్రాహ్మడు.. తాళి కట్టని మొగుడు?

బ్రాహ్మణులు అంటేనే ముందు ఆచారాలు, సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి.. కానీ చాలా మంది బ్రాహ్మణులుగా పుట్టినా మూఢాచారాలను వ్యతిరేకించారు. హేతువాదులుగానూ సమాజంపై తమదైన ముద్ర వేశారు. ఆచారాల పేరిట సాగే అరాచకాలను వ్యతిరేకించారు. కొందరు ఉద్యమాలు చేసారు. ఇంకొందరు ఉద్యమాలు చేయకపోయినా.. తమ జీవితంలో అలాంటి ఆచారాలకు దూరంగా బతికారు.

అలాంటి వారిలో సినీ గీత రచయిత, సాహిత్య పరిశోధకుడు ఆరుద్ర ఒకరు. ఆయన రామలక్ష్మిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆ దంపతులు అన్యోన్యంగా ఎన్నో ఏళ్లు కాపురం చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆచారాలు, విశ్వాసాలను అంతగా పాటించని ఆరుద్ర.. అసలు జంధ్యం వేసుకునేవారు కాదు.. అందుకే ఆయన జంధ్యం లేని బ్రాహ్మణుడుగా పేరు గడించారు. అంతే కాదు.. రామలక్ష్మిని జీవిత భాగస్వామిగా చేసుకున్నా.. సంప్రదాయబద్దంగా కల్యాణం చేసుకోలేదు.
రామలక్ష్మి మెడలో తాళి కట్ట లేదు.

మనసా వాచా కర్మణా వారు దంపతులయ్యారు తప్ప.. ఆచార సంప్రదాయాలతో కాదు. అయితే.. ఈ ఆచారాలు పట్టని తత్వం చిన్న చిన్న ఇబ్బందులనూ తెచ్చి పెట్టింది. మరో విషయం ఏంటంటే.. ఆరుద్రను రామలక్ష్మి అబ్బాయ్‌ అని పిలిచేవారట. ఈ విషయాలన్నీ తాజాగా సీనియర్ జర్నలిస్టు తోట భావనారాయణ తన ఫేస్‌ బుక్‌ పేజీపై పంచుకున్నారు. ఆయనకు ఆరుద్ర గారి కుటుంబంలో మంచి సాన్నిహిత్యం ఉంది.

తోటభావనారాయణతో ఆరుద్ర .. బ్రాహ్మణుణ్ణే కానీ జంధ్యం వేసు కోలేదని... పెళ్ళి చేసుకున్నాను గాని తాళి కట్టలేదని అనే వారుట. ఆ ఆరుద్ర గారి డైలాగ్ సంగతేమోగాని రామలక్ష్మి గారికి మాత్రం దీని వల్ల ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదట.. ఎలాగంటే.. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు సిటీ బస్సెక్కితే రామలక్ష్మి బోసి మెడ చూసి .. అయ్యో ఈ వయసులో ఇన్ని కష్టాలా? అన్నట్టు  తోటి ప్రయాణికులు విడ్డూరంగా చూసేవారట. ఆ విషయాలన్నీ రామలక్ష్మి తనతో చెప్పి నవ్వుకునేవారని తోట భావనారాయణ తన పోస్టులో గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: