ఆహా.. తిరుపతి రైల్వే స్టేషన్‌ దశ తిరిగిందిగా?

దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇప్పుడు మహర్దశ పట్టింది. తిరుపతి రైల్వే స్టేషన్ దశ తిరిగిపోయింది. ఎందుకంటే.. తిరుపతి రైల్వే స్టేషన్‌ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇకపై శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకునే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తిరుపతి స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను చేపట్టాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

దీంతో తిరుపతి స్టేషన్‌ అభివృద్ధి కోసం దక్షిణ మధ్య రైల్వే మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది.  ఇందు కోసం ఈపీసి విధానంలో వివిధ పనులను చేపట్టాలని నిర్ణయించింది. అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తారు. స్టేషన్ లో వివిధ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతారు. పునాది స్థాయి,  గ్రౌండ్‌ జీ+3 అంతస్తులతో దక్షిణం వైపు స్టేషన్‌ భవనం అభివృద్ధి చేస్తారు. అలాగే గ్రౌండ్‌ జీ+3 అంతస్తులతో ఉత్తరం వైపు స్టేషన్‌ భవనం అభివృద్ధి చేస్తారు. స్టేషన్‌ భవనం ఉత్తరం, దక్షిణం వైపు అనుసంధానం చేస్తూ ఎయిర్‌ కాన్కోర్స్‌ నిర్మాణం చేస్తారు.

ప్రస్తుత ప్లాట్‌ఫామ్ లను అభివృద్ధి చేస్తారు. ప్లాట్‌ఫామ్ లపై పైకప్పు నిర్మాణం చేస్తారు. దక్షిణం వైపు భాగంలో బేస్‌మెంట్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. గౌండ్‌ ఫ్లోర్‌లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్‌ కౌంటర్‌, విశ్రాంతి గది ఏర్పాటు చేస్తారు. మొదటి, రెండవ అంతస్తులలో కామన్‌ విశ్రాంతి గది, మహిళల విశ్రాంతి గది, ఆహార శాల, మరుగుదొడ్లు, క్లాక్‌ రూమ్ ఏర్పాటు చేస్తారు. మూడో అంతస్తులో రైల్వే కార్యాలయాలు, విశ్రాంతి గదుల ఏర్పరుస్తారు.

ఉత్తరం వైపు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్‌ కౌంటర్‌, వ్రిశ్రాంతి గది ఏర్పాటు చేస్తారు. ఈ స్టేషన్‌లో 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, సమాచారం తెలియజేసే డిస్‌ప్లే వ్యవస్థతో రూపు రేఖలో మారిపోనున్నాయి. అంతే కాదు. ప్రయాణికులకు వివరాలు అందజేసే వ్యవస్థ, సిసిటీవి కెమెరాలు, కోచ్‌ వివరాలు, రైళ్ల వివరాలు తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: