కొత్త టార్గెట్లకు గురి పెడుతున్న పుతిన్‌?

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రోజురోజుకూ పట్టు సాధిస్తున్న రష్యా ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. మరియుపోల్‌ వంటి కీలక నగరాలను హస్తగతం చేసుకున్న రష్యా ఇప్పుడు సరికొత్త ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది.  ప్రస్తుతం డాన్‌బాస్ ప్రాంత ఆక్రమణే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది. తూర్పు డాన్‌బాస్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతంలోని 40 చిన్న పట్టణాలపై రష్యా సైనికులు దాడులు చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా వెల్లడించింది. 50 వరకూ ప్రభుత్వ ప్రదేశాలను, 38 నివాసాలు, ఓ పాఠశాలను మాస్కో సేనలు ఇప్పటికే ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది. మాస్కో బలగాల దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సైన్యం వివరించింది. ఈ దాడుల్లో మరో 50 మంది వరకూ గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా ఆక్రమణ మొదలైన నాటి నుంచి డొనెట్స్‌క్‌ ప్రాంతంలో మాస్కో బలగాల దాడిలో 150మంది చిన్నారులు చనిపోయారట.

ఇక మొత్తం ఉక్రెయిన్‌ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకూ 240 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. అలాగే సెవెరోడొనెట్స్‌క్‌, లైసింఛాన్స్‌క్ నగరాలను కూడా ముట్టడించేందుకు రష్యా వేల సంఖ్యలో బలగాలను రంగంలోకి దింపినట్లు సమాచారం వస్తోంది.  మాస్కో బలగాలు ఉక్రెయిన్ సేనలను మూడువైపుల నుంచి ముట్టడించి లుహాన్స్‌క్‌ ప్రావిన్స్‌ను అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

డొనెట్స్‌క్‌ నది మీద ఉన్న ఒక్క వంతెన మినహా అన్నింటిని మాస్కో సేనలు ధ్వంసం చేసిశాయని లుహాన్స్‌క్‌ గవర్నర్ ప్రకటించారు. మాస్కో బలగాల దాడితో సెవెరో డొనెట్స్‌క్‌ నగరం ప్రమాదంలో పడే అవకాశం ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ యుద్ధంలో చిక్కిన 8వేల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా నిర్బంధించింది. వీరిని రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల ఆధీనంలోని లుహాన్స్‌క్‌, డొనెట్స్‌క్‌లో నిర్బంధించారని ఉక్రెయిన్ అంటోంది. అంతే కాదు.. రోజూ వందలమందిని రష్యా అదుపులోకి తీసుకుంటోందని ఉక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: