దేవుడా: పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేరట?
అలా వైఎస్ హయాంలో పట్టాలెక్కిన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో ఇంకేముంది నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే.. చంద్రబాబు ఆ మాట చెప్పి దాదాపు 8,9 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని తాజాగా ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందని తాజాగా వెల్లడించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని ఎప్పుడు రిపేర్ చేస్తామో.. మళ్లీ ఎప్పుడు పనులు జోరందుకుంటాయో.. మొత్తానికి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ప్రకటించడం విశేషం.
పోలవరం పూర్తికి గడువు ఏమీ పెట్టుకోలేదని.. తాను ఎలాంటి తేదీ ఇవ్వడం లేదని.. కొత్తగా జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు అంటున్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. అది దెబ్బతినకపోతే ప్రాజెక్టు పూర్తయ్యేదని అంబటి అంటున్నారు. ఆ డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే దానిపైనే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది తేలుతుందని అంటున్నారు అంబటి రాంబాబు. ఆ విషయంపైనే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆధారపడుతుందంటున్నారు.
అయితే.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని మూడేళ్ల క్రితమే గుర్తించామని చెబుతున్న అంబటి రాంబాబు.. 2020 మార్చిలో పీపీఏ సమావేశంలో చర్చించారని తెలిపారు. అందుకే డ్యాం రీ డిజైన్ చేయాలని ప్యానెల్‌ను అడిగామని.. ప్రపంచంలో ఎక్కడా ఇలా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదని అంబటి రాంబాబు. సో.. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నమాత్రం ఎవరూ చెప్పలేని విషయంగా మారింది.