ఈసారైనా నారా లోకేశ్ కోరిక నెరవేరుతుందా?


నారా లోకేశ్.. నారా చంద్రబాబు రాజకీయ వారసుడు. టీడీపీకి భవిష్యత్ నేత.. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించాల్సిన వాడు. కానీ ఆయన గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితంపై మాయని మచ్చ వేసింది. అందుకే ఈసారి నారా లోకేశ్‌ మంగళగిరిపై ప్రత్యేకంగా శ్రద్ద పెడుతున్నారు. ఇప్పటి నుంచి మంగళగిరి వాసులను ఆకట్టుకునేలా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన మంగళగిరిలో పర్యటించారు.


ఈ పర్యటనలో జగన్ సర్కారుపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు రాముడులాంటి పాలన అందిస్తే ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాక్షసుడిలా పరిపాలన చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటలో కరోనాతో మృతిచెందిన కార్యకర్తల కుంటుబ సభ్యులను లోకేష్ ఓదార్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజలకు అగ్గిపెట్టె, కొవ్వొత్తి, విసన కర్రలు పంచి పెట్టారు నారా లోకేశ్.


సీఎం జగన్ బాదుడే...బాదుడు, వివిధ పన్నుల భారాలతో ఏడాదికి ఒక్కో కుటుంబం నుంచి లక్షా 8 వేలు కొట్టేస్తున్నారని నారా లోకేశ్ కొత్త లెక్కలు చెప్పారు. అంతేకాదు.. మంగళగిరి అభివృద్ధిపై స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు నారా లోకేష్. తాను రెండేళ్ల మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో 24వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించానంటున్నారు. కానీ.. ఆర్కే మూడేళ్లలో మూడు కిలోమీటర్ల రహదారి నిర్మించలేకపోయారని నారా లోకేశ్ సవాల్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే యూ1జోన్ ఎత్తేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు టీడీపీ తరపున 50వేలు ఇస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. అలాగే పొత్తులపై స్పందించిన నారా లోకేశ్ ఈ విషాయన్ని అధిష్ఠానమే చూసుకుంటుందని వివరణ ఇచ్చారు. మరి మంగళగిరిలో జెండా ఎగరేయాలన్న పట్టుదలతో నారా లోకేశ్ బాగానే పని చేస్తున్నారు. మరి ఈసారైనా నారా లోకేశ్ కోరిక నెరవేరుతుందా..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: