బాబు ఆ తప్పు కరెక్ట్ చేసుకోనంటే 2024లోనూ ప్రతిపక్షంలోనే...!
పార్టీకి కార్యకర్తలే కీలకమని పదే పదే చెప్పే.. చంద్రబాబు.. కార్యకర్తలకు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా.. లేకున్నా.. చేసింది ఏమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 40 వసంతాల పండుగ ప్రారంభం వేళ తమ్ముళ్లను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదైనా చేయాలని అంటున్నారు. అంటే.. పార్టీలో కీలక పదవులు అప్పగించడం లేదా.. పార్టీని మరింత క్రియాశీలకంగా మార్చే క్రతువులో తమ్ముళ్లపాత్రను మరిం త పెంచడం చేయాలని అంటున్నారు.
ఇప్పుడు ఉన్న పదవులను గమనిస్తే.. కొందరు మాత్రమే పదవులు పొందారు. అలాగని అందరికీ ఇచ్చేందుకు కూడా పదవులు లేవు. కానీ, మన పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదైనా చేస్తారు.. అని అనుకుంటున్న వారికి సాంత్వన కలిగేలా చంద్రబాబు నిర్ణయాలు ఉండాలని.. నాయకులు, కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే.. పదవులు తీసుకున్నవారికే పదవులు ఇస్తున్నారు. కొత్తగా ఉన్నవారిని విస్మరిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అందరూ పార్టీని పట్టి నడిపిస్తున్నారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వినాలనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఇది కేడర్ గట్టిగా కోరుకుంటోంది.
కానీ, కొందరు చెబుతున్న మాటలే చంద్రబాబు వింటున్నారు. ఏదో జూమ్ మీటింగులు పెట్టడం.. వారితో మాట్లాడడం అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాకుండా.. ఈ 40 వసంతాల వేడుకలో పటిష్టమైన కార్యాచరణ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తేనే.. అధినాయకుడిగా ఆయన అందరికీ న్యాయం చేసిన వారు అవుతారు. పార్టీని మరింత బలోపేతం చేసిన వారు కూడా అవుతారని అంటున్నారు తమ్ముళ్లు.