40 శాతం టికెట్లు వాళ్లకే.. చంద్రబాబు సంచలనం?
ఉరుకులు పెట్టే యువతకే వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు అని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీ గెలుపు చారిత్రిక అవసరం అని యువత గుర్తించాలని అన్నారు. రానున్న 40 ఏళ్లకు సరిపడా సమర్థ నాయకత్వం తయారు చేసుకోవాలని సూచించిన తెలుగు దేశం అధినేత తెలుగుదేశం పార్టీ చారిత్రిక అవసరం అని.. ఆ దిశగా యువత పని చేయాలని పిలుపు ఇచ్చారు. యువతకు ఉపాధి రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం రావాలని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు కీలక ప్రకటన వెనుక ఓ కీలక వ్యూహం కూడా ఉంది. తెలుగు దేశం ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం ఎక్కించారు. లాయర్లు, వైద్యులు, వ్యాపార నిపుణులు.. ఇలాంటి వారెందరో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అలా కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు సీనియర్లుగా ఉన్న వారంతా అలా యువకులుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారే.
అందుకే ఇప్పుడు చంద్రబాబు అదే ప్రయోగం చేయాలని భావిస్తున్నారు. 1983 లో వచ్చినట్లు మళ్ళీ యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. సమాజ హితం కోరుకునే యువతకు ప్రాధాన్యం ఇస్తానని.. వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న యువత కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు చేసిన ఈ కీలక ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది.