ఏపీలో ఎవరు గెలిచినా ఈ సీన్ మారదా...!
నిజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఇంకా పేదరికం స్వాతంత్య్రం వచ్చే నాటికి ఎలా ఉందో .. ఇప్పటికీ 50 శాతం మేరకు అలానే ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాలు కూడా వాటినే చెబుతున్నా యి. అదేసమయంలో ఈ సామాజిక వర్గాలకు చెందిన వారికి పదవులు దక్కుతున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. కానీ, క్షేత్రస్థాయిలో ఇంకా ఎస్సీలు, ఎస్టీలు.. ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం.. ఏపీలో ఇళ్లు లేని ఎస్సీలు.. 35 శాతం మంది ఉన్నారు. మరో 25 శాతం మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు.
ఇదేఏ పరిస్థితి ఎస్టీల్లో అయితే.. మరింత దారుణంగా ఉంది. వారు కొండ ప్రాంతాలకే పరిమితమై.... నగర జీవనానికి చాలా దూరంగా ఉన్నారు. విద్య లేదు. వైద్యం అందడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిని మార్చేదెవరు..? అనేది ప్రధాన ప్రశ్న. ఇక,బీసీల సమస్య మరో విధంగా ఉంది. వీరికి విద్యను అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆర్థిక సమస్యల కారణంగా.. బీసీ కుటుంబాల్లోని విద్యార్థులు 70 శాతం మంది మధ్యలోనే చదువును నిలిపివేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.వీరి గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదనేది ప్రధాన ప్రశ్న.
ఏ ప్రభుత్వం వచ్చినా.. తమకు ఏదో చేస్తుందని వీరు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ, చివరకు రాజకీయంగా నలుగురికి పదవులు ఇచ్చి.. కన్నీళ్లు తుడుస్తున్నారే తప్ప.. ప్రయోజనం మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. మరి ఇలాంటివారి సమస్యలను పట్టించుకునే నాధుడు ఏడనేది సర్వేల్లో ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ``మాకేదో చేస్తామని చెబుతున్నారు. కానీ, ఏం చేయడం లేదు.`` అని ఎక్కువ మంది బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నికల సమయంలో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరి ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చేస్తుందో ఏలదో చూడాలి.