ఐదు రాష్ట్రాల రిజ‌ల్ట్‌ ఎఫెక్ట్‌... దేశ రాజ‌కీయాల్లో ఊహించ‌ని మ‌లుపులు...!

VUYYURU SUBHASH
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల లెక్కింపు మొద‌లైంది. అంద‌రూ ఊహించిన‌ట్లే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం దిశ‌గా వెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అయ్యేలా క‌నిపిస్తోంది. దీని ద్వారా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండా ఎగుర‌వేస్తుంద‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ గురువారం మొద‌లైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ తో పాటు, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. నెల రోజుల పాటు ఆయా విడ‌త‌ల్లో జ‌రిగిన పోలింగ్ లో నేత‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు స‌ర‌ళిని ప‌రిశీలిస్తే అతి పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే 250కి పైగా స్థానాల్లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.
మ‌రో ప్ర‌ధాన పోటీ దారు అయిన స‌మాజ్ వాదీ పార్టీ 100 స్థానాల‌కు పైగా లీడింగ్ లో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్ నామ‌మాత్రంగా మిగిలిపోయాయి. ఈ పార్టీలు సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యేలా ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఓట్ల‌ను భారీగా చీల్చితే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని భావించిన ఎస్పీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్లైంది. అత్య‌ధిక స్థానాల‌తో బీజేపీ మ‌రోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతుంది. ఇక మ‌రో ప్ర‌ధాన రాష్ట్ర‌మైన పంజాబ్ లో కాంగ్రెస్ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ద‌ళిత సీఎం అభ్య‌ర్థిని పెట్టి మ‌రోసారి విజ‌యం సాధించాల‌నే క‌ల తీర‌కుండా పోయింది.
ఇక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ ఏక‌ప‌క్షంగా దూసుకుపోతోంది. 90 స్థానాల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ చాలా దూరంలో ఉంది. మ‌రో రెండు రాష్ట్రాలైన‌ ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్ లో కూడా ఆధిక్యం దిశ‌గా బీజేపీ దూసుకుపోతోంది. గోవాలో మాత్రం బీజేపీకి, కాంగ్రెస్ కు మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని విశ్లేషిస్తే ఇక బీజేపీకి తిరుగేలేద‌ని అర్థం అవుతోంది. ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో అధికారం దిశ‌గా సాగుతోంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై కూడా ఈ ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉండ‌నుంది. ఎందుకంటే రాబోయే ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ అధికారంలో ఉండ‌డం విశేషం.
ఈ సంవ‌త్స‌రం ఆఖ‌రులో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే ఏడాది పెద్ద రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లో కూడా ఎన్నిక‌లు ఉంటాయి. వీట‌న్నింటిలోనూ బీజేపీ అధికారంలో ఉండ‌డం వ‌ల్ల  ఆ ప్ర‌భావం సార్వ‌త్రిక ఎన్నిక‌లపై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని.. మ‌రోసారి ప్ర‌ధాని పీఠం మోదీదే అని విశ్లేష‌కులు తేల్చి చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: