జగన్ పై పెరుగుతున్న కేసీఆర్ ఒత్తిడి?

తెలంగాణ  సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు నింపుతోంది. ఒకే రోజు ఏకంగా 80 వేల ఉద్యోగాల గురించి ప్రకటన చేశారు. వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని.. జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉదయం పది గంటలకు నిరుద్యోగులపై ప్రకటన చేస్తానని మరీ ముందు రోజే చెప్పిన కేసీఆర్.. చెప్పినట్టే నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. తెలంగాణలో మొత్తం 90 వేల పోస్టులు గుర్తించామన్న కేసీఆర్.. అందులో 10 వేల వరకూ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్న కేసీఆర్.. మిగిలిన 80 వేలు వెంటనే భర్తీ చేస్తామన్నారు.

కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఇటు ఏపీలోనూ చర్చకు దారి తీసింది. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఈ అంశంపై చర్చించుకున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రకటన ఏపీ సీఎం జగన్ పైనా ఒత్తిడి కారణం అవుతోంది. ఉద్యోగాల విషయంలో పొరుగు రాష్ట్రంతో పోల్చుకుంటున్న నేతలు జగన్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ వంటి పార్టీలు ఉద్యోగాలపై ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నాయి.

జగన్ తన వెయ్యి రోజుల పాలనలో నిరుద్యోగుల అర్హతకు తగిన ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయలేకపోయారని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్ అంటున్నారు. ఆ మాత్రం చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంటున్న ప్రణవ్ గోపాల్.. ఉద్యోగమో.. రామచంద్రా.. అంటూ ఎ.పి నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంటే జగన్ రెడ్డికి మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉందని విమర్శించారు.

మాట తప్పని మడమ తిప్పని  నేతనని చెప్పుకుని నిరుద్యోగులను నిలువునా ముంచారంటున్న టీడీపీ నేతలు గత మూడు జనవరి నెలల నుండి రెండు లక్షల 35 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. ఏపీ వార్షిక బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరించకపోతే నిరుద్యోగుల విప్లవం తెస్తామని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్ అన్నారు. మొత్తం మీద కేసీఆర్ ప్రకటన జగన్ పైనా ఒత్తిడి పెంచుతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: