కొత్త రాజకీయం: తెలంగాణలో మరో పాదయాత్ర?

పాదయాత్ర.. రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్లే వారికి ఇదో సోపానం.. ఇలాంటి పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని చెప్పుకోవచ్చు.. ఆయన పాదయాత్రతోనే మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ కూడా పాదయాత్రతోనే అధికారం సంపాదించారు. ఇక ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు..అధికారం అందుకున్నారు.

పాదయాత్ర చేస్తే అధికారం ఖాయం అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఇప్పుడు చాలా మంది నాయకులు పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే షర్మిల పాదయాత్ర ప్రారంభించి కరోనా కారణంగా నిలిపేశారు. మళ్లీ త్వరలోనే ఆమె పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఆ మధ్య రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధం అవుతోంది.

ఈసారి ఎవరా అనుకుంటున్నారా.. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదలి బీఎస్పీలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందంటున్న బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కౌలు రైతులు, నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు వంటి వారి కోసం..  ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉద్యోగం నుంచి తీసేసిన బిడ్డలందరి కోసం తాను పాదయాత్ర చేస్తానన్నారు. ఈ పాదయాత్ర కాన్షీరాం స్ఫూర్తితో అంబేడ్కర్‌, జ్యోతిబా పూలే సిద్ధాంతంతో మాయావతి ఆశీర్వాదంతో 300 రోజులు జరుగుతుందని ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమమాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  పాల్గొన్నారు. రాష్ట్రంలో రానున్నది బహుజన రాజ్యమేనని.. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ అయితే పీకే, ప్రకాష్‌రాజ్‌ లాంటి వాళ్లు ఎందుకని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మరి ఈ పాదయాత్ర ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: