ఆ సీనియ‌ర్ రాజ‌కీయ స‌న్యాసం చేస్తున్నారా... టీడీపీలో హాట్ టాపిక్‌..!

VUYYURU SUBHASH
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌నున్నా రు. త్వ‌ర‌లోనే ఆయ‌న వాన ప్ర‌స్థంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఆయ‌న దీనిపై క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో .. య‌న‌మ‌ల అనేక ప‌దవులు అలంక‌రించారు. స్పీక‌ర్‌గా, మంత్రిగా.. పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అయితే.. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న ఓట‌మిని చ‌విచూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మండ‌లి స‌భ్య‌త్వంతో నెట్టుకువ‌స్తున్నారు. అయితే.. ఈ స‌భ్య‌త్వం 2025 వ‌రకు ఉంది.

అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ ప‌రంగా దూకుడు చూపించే ప‌రిస్థితిలేద‌ని.. స్ప‌ష్టం అవుతోంది. యువ‌త‌రం వ్యూహాల‌కు త‌గిన విధంగా.. య‌న‌మ‌ల పుంజుకోలేక పోతున్నారు. పైగా ఇప్పుడు పార్టీకి అత్యంత కీల‌క స‌మ‌యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గాల‌ని.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని ఆయ‌న‌కోరుతున్నారు.

అయితే.. కొంద‌రు యాక్టివ్‌గానే ఉన్నా.. మిగిలిన వారు మాత్రం దూరంగా ఉన్నారు. వీరిలో య‌న‌మ‌ల కూడా ఉన్నారు. చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌ను నేరుగా అన‌క‌పోయినా.. ఆయ‌నను కూడా ఇండైరెక్ట్‌గా హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగే ప‌రిస్థితిలేద‌ని.. ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల స్వ‌యంగా చంద్ర‌బాబును క‌లిసిన య‌న‌మ‌ల‌.. ఈ విష‌యంపై సుదీర్ఘంగా ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

య‌న‌మ‌ల‌ది టీడీపీలో సుధీర్ఘ‌మైన రాజ‌కీయ ప్ర‌స్థానం. 1983 నుంచి 2004 వ‌ర‌కు ఓట‌మి లేకుండా వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీ ప‌ట్టు కోల్పోయింది. 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోతూ వ‌స్తోంది. ఇక త‌న ప‌ద‌వీకాలం ముగిసిన వెంట‌నే త‌న‌ను కేవ‌లం స‌ల‌హాలు, సూచ‌న‌ల వ‌ర‌కు త‌న‌ను ప‌రిమితం చేయాల‌ని.. ఆయ‌న కోరిన‌ట్టు స‌మాచారం.

అయితే..దీనికి చంద్ర‌బాబు అంగీక‌రించ‌లేద‌ని.. యువ‌త‌ను వెంట‌బెట్టుకుని.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచాల‌ని.. సూచించిన‌ట్టు తెలిసింది. దీనికి కూడా య‌న‌మ‌ల ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. దీంతోనే ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు త్వ‌ర‌లోనే గుడ్‌బై చెప్పి.. త‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని పార్టీలోని కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: