
సింగరేణిలో భారీ కుంభకోణం..? నిజమేనా..?
అయితే.. ఇప్పుడు ఈ సింగరేణి సంస్థలో అంత్యంత భారీ స్థాయిలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది దేశాన్ని కుదిపేసిన రఫేల్ స్కామ్ కన్నా పెద్ద కుంభ కోణం అని విపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నైనీ బొగ్గు గని లీజు వెనక రూ.50 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సింగరేణిలో రఫేల్ కంటే పెద్ద స్కామ్ చేసేందుకు కుట్ర జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు.
సింగరేణి సంస్థకు కేంద్రం ఒడిశాలోని ‘నైనీ బొగ్గు గని’ని కేటాయించింది. అయితే ఈ నైనీ బొగ్గు గనిని ప్రైవేట్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు కట్టబెట్టాలని సింగరేణి సంస్థ ప్రయత్నించిందట. ఈ ఆలోచన వెనక రూ.50 వేల కోట్లు కొల్లగొట్టే కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ స్కామ్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నైనీ బొగ్గు గని లీజు విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
టెండర్లు రద్దు చేసి.. మళ్లీ పాత నిబంధనలతోనే టెండర్లు పిలవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నైనీ బొగ్గు గని విషయంలో ఐఏఎస్ అధికారి శ్రీధర్ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఆయన్ను రీకాల్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్ నిబంధనలకు విరుద్ధంగా 8 సంవత్సరాలుగా సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారని కూడా రేవంత్ అన్నారు. శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.