నిజమా..! జగన్.. ఆ సత్యసాయి ప్రాజెక్టు ఆపేశాడా..?

సత్యసాయి బాబా.. అనంతపురం పుట్టపర్తి కేంద్రంగా కొన్ని దశాబ్దాల పాటు సేవలందించిన బాబా పుట్టపర్తి సత్యసాయిబాబా.. ఆయన జీవితంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నా.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మాత్రం అపూర్వమనే చెప్పాలి. ప్రత్యేకించి నీటి కోసం అల్లాడిపోయే అనంతపురం జిల్లాలో తాగునీటి ప్రాజెక్టును అందించిన మహనీయుడాయన. అయితే... ఈ తాగునీటి ప్రాజక్టుకు రూపకల్పన ఎలా జరిగింది.. అసలు బీజం ఎలా పడింది.. ఈ విషయాల గురించి తాజాగా మాజీ సీఎం చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.


అవేంటంటే.. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న సమయంలో.. ఓసారి సత్యసాయిబాబాను కలిశారట. సాధారణంగా చంద్రబాబు బాబాల వద్దకు తక్కువగా వెళ్తారు. ఆ సమయంలో అనంతపురం జిల్లాలోని తాగునీటి సమస్య గురించి బాబా వద్ద చంద్రబాబు ప్రస్తావించారట.. అప్పుడు సత్యసాయి బాబా..తాను భక్తులకు పిలుపు ఇస్తే విరాళాలు వస్తాయి.. వాటిలో తాగునీటి ప్రాజెక్టు  ప్రారంభిస్తామని చెప్పారట. అలాగే చేయండి బాబా అని చంద్రబాబు అన్నారట.


అప్పుడు సత్యసాయి బాబా తన భక్తులు అందించిన విరాళాలతో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో ప్రారంభించారట. అనంతపురం జిల్లాలతో పాటు.. తూర్పు గోదావరి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఈ సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారట. అయితే.. ప్రాజెక్టులు ప్రారంభించి ప్రభుత్వానికి అప్పగించిన సత్యసాయి.. వాటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం చూసుకోవాలని సూచించారట.


అలా మొదలైన సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి బ్రహ్మాండంగా సేవలందించాయని.. కానీ చివరకు జగన్ సర్కారు వచ్చాక అవి కూడా నడవడం లేదని.. అవి ప్రారంభించిన తర్వాత తొలిసారి.. ఆ సత్యసాయి ప్రాజెక్టులు ఆగిపోయాయని చంద్రబాబు తాజాగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. మరి చంద్రబాబు మాటల్లో నిజం ఎంత ఉందో.. ఈ ప్రభుత్వం చెప్పాలి..ఇలాంటి ఆరోపణలపై స్పందించి వెంటనే ప్రజల సందేహాలు తీర్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: