వైసీపీలో ఇంత‌ త‌ర్జ‌న భ‌ర్జ‌నా... జ‌గ‌న్ డెసిష‌న్‌పైనే టెన్ష‌న్‌...!

VUYYURU SUBHASH
వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇదే ఇప్పుడు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌గా మారింది. జిల్లాల ఏర్పాటు అంశం పార్టీని తీవ్ర స్థాయి లో కుదిపేస్తోంది. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో రాజంపేట‌ను కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న అన్న‌మయ్య జిల్లా కు జిల్లా కేంద్రం చేయాల‌ని.. ఇక్క‌డి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. అంతేకాదు.. అధికార పార్టీలోనే నేత‌లు రెండుగా చీలిపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజాగా రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. రాజంపేట ప్ర‌జ‌ల మ‌నోభావాలు వివ‌రించారు.

రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేయాల‌ని వారు సీఎంకు విన్న‌వించారు. దీనికి సీఎం జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించార‌ని.. రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. ఇది జిల్లా లో తీవ్ర స్థాయిలో చ‌ర్చకు వ‌స్తోంది. ఎందుకంటే.. రాయ‌చోటిని ప్ర‌భుత్వం అన్న‌మ‌య్య జిల్లాకు కేంద్రంగా నిర్ణ‌యించి.. ప్ర‌క‌ట‌న కూడా చేసింది. దీంతో రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట‌ శ్రీకాంత్‌రెడ్డికు ఫాలోయింగ్ పెరిగింది. సోష‌ల్ మీడియాలోనూ.. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. రాయ‌చోటి ఇప్ప‌టికైనా బాగుప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా జిల్లా కేంద్రంపై వివాదం త‌లెత్తడం.. సొంత పార్టీలోనే నేత‌లు రోడ్డెక్క‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో గ‌డికోట ఇరుకున ప‌డ్డారు. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లా కేంద్రం చేసినందుకు సంతోషించే స‌మ‌యంలో ఇలా ఉద్య‌మాలు రావ‌డంతో ఆయ‌న ఎటూ చెప్ప‌లేక పోయా రు. ఇక‌, ఇప్పుడు ఏకంగా సీఎం చెంత‌కు ఈ వివాదం రావ‌డం.. ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డం వంటివి.. ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఏం చేయాలి?  రాయ‌చోటిని ప్ర‌క‌టించి.. రాజంపేట‌కు మారిస్తే.. త‌ను ఏమీ చేయ‌లేక పోయాన‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అంతేకాదు.. ఆది నుంచి కూడా త‌న‌ను వెనుకేసుకు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌కు.. పార్టీలోనూ.. చుల‌క‌న అయ్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని బావిస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలో చోటు వ‌స్తుంద‌ని ఆశించి.. భంగ‌ప‌డిన ఆయ‌న‌కు ఇప్పుడు జిల్లా కేంద్రం ఎఫెక్ట్ మ‌రింత ఇబ్బంది పెడుతుండ‌డంతో అనుకున్న‌ట్టుగా జ‌రుగుతుందా ?  లేక ఏదైనా తేడా జ‌రుగుతుందా? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి చివ‌ర‌కు జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: