ఔరా..! సీబీఐలోనూ చంద్రబాబు మనుషులు..?

మాజీ సీఎం చంద్రబాబుపై వ్యవస్థలను బాగా మేనేజ్‌ చేస్తారన్న ముద్ర ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు ఉన్న వ్యక్తి.. ఆ సమయంలో ఆయన అనేక వ్యవస్థలలో తన మనుషులను ఉంచారని.. ఇప్పుడు వారంతా కీలక స్థానాల్లో ఉండి.. అవసరం వచ్చినప్పుడు చంద్రబాబుకు సాయం చేస్తుంటారని ఆయన విమర్శకులు చెబుతుంటారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తుల సంస్థల్లోనూ.. న్యాయవ్యవస్థలోనూ చంద్రబాబు మనుషులు ఉన్నారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది.

వైసీపీ ఇప్పుడు ఉన్నట్టుంది ఈ ఆరోపణను విచిత్రమైన పరిస్థితుల్లో ఉపయోగించింది. ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ కేసులో దస్తగిరి అనే వివేకానందరెడ్డి కారు డ్రైవర్ అప్రూవర్‌ గా మారేందుకు ముందుకు వచ్చాడు.. దస్తగిరి చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు  ముందుకు పోనిచ్చిన సీబీఐ చార్జ్ షీటు కూడా తయారు చేసింది. ఇటీవల ఈ సీబీఐ చార్జ్‌ షీట్‌ పత్రికల్లో వెలుగు చూసింది. ప్రధానంగా వైసీపీ ఎల్లో మీడియా అంటూ ఈసడించే పత్రికల్లో ఈ విషయం ప్రముఖంగా వచ్చింది.

ఆ చార్జ్‌షీటులో ఏముందయ్యా అంటే.. కడప ఎంపీగా ఉన్న అవినాశ్‌ రెడ్డి.. తన ఎంపీ సీటుకు అడ్డువస్తాడన్న కారణంతో వైఎస్ వివేకానందరెడ్డిని చంపించి ఉంటాడని మేం అనుమానిస్తున్నాం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాం అని చార్జ్‌ షీటులో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాన్ని ఎల్లో మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది. దీంతో డిఫెన్స్‌లో పడిపోయిన  జగన్ టీమ్.. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మొదట సైలెంటుగా ఉండిపోయింది.  ఆ తర్వాత మీడియా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా సీబీఐ సంస్థ తీరునే తప్పుబట్టారు.

సీబీఐ సంస్థ.. టీడీపీ, ఎల్లో పత్రికలకు పనికి వచ్చేలా చార్జ్‌ షీట్లు తయారు చేస్తోందని.. వారి కోణంలోనే దర్యాప్తు చేస్తోందని.. అసలు సీబీఐలో చంద్రబాబు మనుషులు ఉన్నారా అని అనుమానం వస్తోందని సజ్జల చెప్పడం నిజంగా షాకింగానే చెప్పుకోవాలి. మరి నిజంగానే సీబీఐలోనూ చంద్రబాబు మనుషులు ఉన్నారా.. లేక.. చార్జ్‌ షీట్‌తో ఉక్కిరి బిక్కిరైన వైసీపీ.. ఏదోలా టీడీపీపై బురద జల్లి తప్పించుకుంటోందా.. ఏమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: